పల్స్‌ పోలియోను విజయవంతం చేయాలి | - | Sakshi
Sakshi News home page

పల్స్‌ పోలియోను విజయవంతం చేయాలి

Jun 28 2026 2:56 AM | Updated on Jun 28 2026 2:56 AM

కడప రూరల్‌ : జిల్లా వ్యాప్తంగా ఆదివారం నిర్వహించే పల్స్‌ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఇన్‌ఛార్జి అధికారి డాక్టర్‌ రవిబాబు తెలిపారు. శనివారం స్థానిక జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడారు. జిల్లాలో పుట్టినప్పటి నుంచి ఐదేళ్ల లోపు చిన్నారులందరికీ, పల్స్‌ పోలియో చుక్కలు వేయించాలన్నారు. ప్రాథమిక, పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో, అంగన్వాడీ కేంద్రాల్లో, రైల్వే స్టేషన్‌, బస్‌ స్టాండ్‌, హైరిస్క్‌ ఏరియాల్లో పోలియో చుక్కల కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు. ఉదయం 7 గంటల నుంచి ఈ కార్యక్రమం ప్రారంభమవుతుందన్నారు. జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారి డాక్టర్‌ ప్రవీణ్‌ మాట్లాడుతూ ప్రతి బిడ్డకు పోలియో చుక్కలు వేయించాలన్నారు. కార్యక్రమం లో డీపీఎమ్‌ఓ మహమ్మద్‌ తహర్‌, డాక్టర్‌ ఆరిపుల్లా, డెమో భారతి, రమేష్‌ రెడ్డి ముని రెడ్డి, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

కడప తాలూకా సీఐ బదిలీ

కడప అర్బన్‌ : కడప తాలూకా పోలీస్‌ స్టేషన్‌లో రెండున్నర నెలలుగా విధులు నిర్వహిస్తున్న సీఐ నరసింహారాజును అనంతపురం వీఆర్‌ (వేకెన్సీ రిజర్వ్‌) కు బదిలీ చేస్తూ కర్నూలు రేంజ్‌ డీఐజీ డాక్టర్‌ కోయ ప్రవీణ్‌ ఉత్తర్వులు శనివారం జారీ చేశారు. గతంలో ఒంటిమిట్ట సీఐగా చేసిన ఆయన, ఇటీవల అల్మాస్‌పేట ఘటనలో దుండగుల రాళ్ల దాడిలో తీవ్రంగా గాయపడ్డారు. ఆ సమయంలో డీఐజీ కోయ ప్రవీణ్‌, జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్‌ విశ్వనాథ్‌ స్వయంగా ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించారు. కోలుకుని విధుల్లో చేరిన సీఐ నరసింహారాజును అకస్మాత్తుగా బదిలీ చేయడంపై సహచర సిబ్బంది, స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పేకాట స్థావరంపై దాడులు

9 మంది అరెస్ట్‌, రూ. 2.53 లక్షలు స్వాధీనం

ప్రొద్దుటూరు క్రైం : పట్టణ శివారులో నడుస్తున్న పేకాట స్థావరంపై త్రీ టౌన్‌ పోలీసులు దాడులు నిర్వహించారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. బొల్లవరం పరిసర ప్రాంతంలో పెద్ద ఎత్తున పేకాట నిర్వహిస్తున్నారని సమాచారం రావడంతో త్రీ టౌన్‌ సీఐ రామాంజనేయుడు, ఎస్‌ఐ సంజీవరెడ్డిలు సిబ్బందితో కలసి శనివారం సాయంత్రం దాడులు నిర్వహించారు. దాడిలో 9 మంది పేకాటరాయుళ్లను అరెస్ట్‌ చేసి వారి వద్ద నుంచి రూ. 2.53 లక్షలు నగదు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులకు పట్టుబడిన వారిలో ప్రొద్దుటూరు, రాజుపాళెం మండలంలోని అరకటవేముల గ్రామానికి చెందిన వారున్నారు. వీరిపై కేసు నమెదు చేసినట్లు ఎస్‌ఐ సంజీవరెడ్డి తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement