● మోటార్‌సైకిల్‌ను ఢీకొట్టిన ఎయిల్ కంపెనీ బస్సు
● కేఎస్‌ఆర్‌ఎం కాలేజీ సివిల్ మేసీ్త్ర శివ దుర్మరణం
కడప అర్బన్ : ఇంటికి పాలప్యాకెట్ తెచ్చేందుకు వెళ్లిన ఆ కుటుంబ యజమాని.. తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు. రోడ్డు ప్రమాదం రూపంలో వచ్చిన మృత్యువు ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. చింతకొమ్మదిన్నె పోలీస్ స్టేషన్ పరిధిలోని నరసరామయ్యగారిపల్లెకు చెందిన పేర్ల శివ (55) శనివారం ఉదయం మోటార్‌సైకిల్‌పై పాలప్యాకెట్ తీసుకుని ఇంటికి వస్తున్నాడు. ఈ క్రమంలో నరసరామయ్యగారిపల్లి క్రాస్ రోడ్డు వద్ద ‘ఎయిల్‌డిక్సన్ సీసీకెమెరాల సంస్థ’కు చెందిన ఉద్యోగుల బస్సు వేగంగా వచ్చి ఆయన బైక్‌ను ఢీకొట్టింది. ఈ ఘోర ప్రమాదంలో బస్సు కింద పడిపోవడంతో శివ తలకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి ఆయన్ను కడప రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ అత్యవసర చికిత్స అందిస్తున్నప్పటికీ కాసేపటికే ఆయన కన్నుమూశారు. మృతుడు పేర్ల శివ గత 30 ఏళ్లుగా స్థానిక కేఎస్‌ఆర్‌ఎం ఇంజనీరింగ్ కళాశాలలో సివిల్ పనుల మేసీ్త్రగా నమ్మకంగా పనిచేస్తూ అందరి మన్ననలు పొందారు. ఆయనకు భార్య, కుమారుడు రాజశేఖర్, కుమార్తె సింధూరి ఉన్నారు. కుమారుడు రాజశేఖర్ కేఎస్‌ఆర్‌ఎం కాలేజీలోనే లెక్చరర్‌గా పనిచేస్తున్నారు. ప్రమాద వార్త తెలిసిన వెంటనే కేఎస్‌ఆర్‌ఎం విద్యాసంస్థల కరస్పాండెంట్ ‘నాని’ స్వయంగా ఆస్పత్రికి వచ్చి మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి, ధైర్యం చెప్పారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
అధికారుల అండతోనే టీచర్ల ప్రైవేట్ దందా
కడప ఎడ్యుకేషన్ : ప్రభుత్వ ఉపాధ్యాయులుగా ఉంటూ అక్రమ సంపాదన కోసం ప్రైవేట్ విద్యాసంస్థలు నడుపుతున్న వారిని వెంటనే విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ శనివారం కడప డీఈఓ కార్యాలయం ఎదుట విద్యార్థి సంఘాలు భారీ ఆందోళన నిర్వహించాయి. ఏఐఎస్‌బీ, పీఎస్‌యూ, ఏఐవైఎల్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ధర్నా అనంతరం అధికారులకు వినతిపత్రం సమర్పించారు.ఈ సందర్భంగా ఏఐఎస్‌బీ రాష్ట్ర అధ్యక్షుడు సగిలి రాజేంద్ర ప్రసాద్, పీఎస్‌యూ రాష్ట్ర కార్యదర్శి సుబ్బరాయుడు, ఏఐవైఎల్ జిల్లా కన్వీనర్ చిరంజీవి మాట్లాడుతూ.. ప్రభుత్వ విద్యపై నమ్మకం కల్పించాల్సిన ఉపాధ్యాయులే దానికి విరుద్ధంగా వ్యవహరించడం దారుణమన్నారు. పోరుమామిళ్లలో ఎలాంటి అనుమతులు లేకుండా కొందరు ప్రభుత్వ టీచర్లు సొంతంగా కోచింగ్ సెంటర్లు, స్కూళ్లు నడుపుతున్నా విద్యాశాఖ అధికారులు స్పందించకపోవడం వెనుక అధికారుల అండదండలు ఉన్నాయని ఆరోపించారు. నిబంధనలు ఉల్లంఘిస్తున్న వారిపై విచారణ జరిపి తక్షణమే చర్యలు తీసుకోకుంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘాల ప్రతినిధులు, విద్యార్థులు పాల్గొన్నారు.


