చాపాడు: కడప జిల్లా మైదుకూరు, చాపాడు నియోజకవర్గాల పరిధిలోని అన్నదాతలకు ‘పసుపు పంట’ అంటే ఎనలేని ప్రీతి. మహిళలు బంగారాన్ని ఎంత ప్రియంగా చూసుకుంటారో.. ఇక్కడి రైతులు కూడా పసుపు పంటను విత్తు నాటినప్పటి నుంచి నూర్పిడి పూర్తయ్యే వరకూ ఆరుగాలం అలానే కంటికి రెప్పలా చూసుకుంటారు. అంతర్జాతీయ మార్కెట్‌లో కడప పసుపునకు విపరీతమైన గిరాకీ ఉండటంతో, రికార్డు ధరల నేపథ్యంలో అన్నదాతల్లో కొత్త జోష్ నెలకొంది. ఈ ఏడాది ప్రారంభంలో క్వింటాల్ ఒట్టి పసుపు ధర రూ.10,500 లు ఉండగా, ప్రస్తుతం అది రూ.12,000 నుండి రూ.12,800 ల గరిష్ట స్థాయికి చేరింది. గతేడాది పసుపు సాగు చేసిన ప్రతి రైతుకు ఊహించని లాభాలు దక్కడంతో, ఈసారి జూలై, ఆగస్టు మాసాల్లో వేయాల్సిన విత్తనాన్ని నెల రోజుల ముందే.. అంటే జూన్ నుంచే జిల్లావ్యాప్తంగా ముమ్మరంగా సాగు చేస్తున్నారు.
ప్రపంచంలో భారత్.. దేశంలో ఏపీ టాప్!
ప్రపంచ దేశాల్లోకెల్లా భారతదేశంలోనే పసుపు అత్యధికంగా సాగవుతోంది. ప్రపంచవ్యాప్తంగా జరిగే పసుపు ఉత్పత్తిలో ఏకంగా 80 శాతం వాటా మన దేశం నుంచే వివిధ దేశాలకు ఎగుమతి అవుతుండటం విశేషం. ఇక దేశీయ పసుపు ఉత్పత్తిలో 40 శాతం వాటాతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే నంబర్ వన్ స్థానంలో నిలిచింది. రాష్ట్రంలో పసుపు సాగును పరిశీలిస్తే వైఎస్సార్ కడప జిల్లా ప్రథమ స్థానంలో నిలవగా, గుంటూరు జిల్లా రెండో స్థానంలో కొనసాగుతోంది.
సాగులో మైదుకూరు ఏకఛత్రాధిపత్యం
జిల్లాలోని మొత్తం 24 మండలాల్లో పసుపు పంట సాగవుతుండగా, అందులో సగానికి పైగా విస్తీర్ణంతో మైదుకూరు నియోజకవర్గమే అగ్రస్థానంలో నిలిచింది. నియోజకవర్గ వ్యాప్తంగా రికార్డు స్థాయిలో 3,443.11 ఎకరాల్లో పసిడి పంట విస్తరించింది. ఇందులోనూ కేవలం ఒక్క మైదుకూరు మండలంలోనే జిల్లాలోనే అత్యధికంగా 1,428.50 ఎకరాల్లో రైతులు పసుపు పంటను విత్తడం విశేషం. ఎకరా సాగులో సాధారణ దిగుబడిగా 30 క్వింటాళ్లు రాగా, పంట బాగా పండితే 40 క్వింటాళ్ల వరకు కూడా బంపర్ దిగుబడి వస్తుందని క్షేత్రస్థాయి రైతులు ధీమాగా చెప్తున్నారు.
పసుపు పంటను పండించేందుకు జిల్లా రైతులు పెట్టుబడి పెట్టడానికి ఎన్నడూ వెనకాడరు. సేద్యం మొదలుకొని పసుపు తయారీ (నూర్పిడి) వరకు ఎకరాకు సగటున రూ.1.50 లక్షల నుంచి రూ.2.20 లక్షల వరకు భారీగా ఖర్చు అవుతోంది. పంటను కంటికి రెప్పలా కాపాడుకుంటూ ప్రకృతి సహకరిస్తేనే 30 నుండి 40 క్వింటాళ్ల దిగుబడి సాధ్యమవుతుంది. అయితే రోజురోజుకు పెరుగుతున్న ఈ పెట్టుబడి ఖర్చులు రైతాంగాన్ని కుంగదీస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఉద్యానశాఖ (హార్టికల్చర్) అధికారులు విత్తన దశకు ముందే.. అంటే మే, జూన్ మాసాల్లోనే గ్రామాల్లో ముందస్తు అవగాహన సదస్సులు నిర్వహించి సాగు ఖర్చులు తగ్గించేలా రైతులకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వివరించాలని డిమాండ్ చేస్తున్నారు. దీనితో పాటు, పంట చేతికి వచ్చే నాటికి మార్కెట్‌లో దళారులు సిండికేట్‌గా మారి ధరలు తగ్గించేస్తున్నారని, రైతులు అమ్ముకున్న తర్వాతే వ్యాపారులు ధరలు పెంచుతున్నారని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ దోపిడీకి అడ్డుకట్ట వేయాలంటే, పసుపు పంటను సురక్షితంగా నిల్వ ఉంచుకునేలా ప్రభుత్వం మైదుకూరు, సీతారామపురం ప్రాంతాల్లో తక్షణమే శీతలీకరణ గోదాములను నిర్మించాలని రైతాంగం గట్టిగా డిమాండ్ చేస్తోంది.


