కడప కేంద్రకారాగారం వద్ద పోలీసుల హైడ్రామా ! | - | Sakshi
Sakshi News home page

కడప కేంద్రకారాగారం వద్ద పోలీసుల హైడ్రామా !

Jun 27 2026 1:43 AM | Updated on Jun 27 2026 1:43 AM

బెయిల్‌పై వచ్చిన రియాజ్‌, అతహవుల్లా ..

ఆ వెంటనే అదుపులోకి తీసుకున్న

కడప టూటౌన్‌ పోలీసులు

ఇద్దరిని అల్మాస్‌పేట ఘటనలో అరెస్ట్‌.... రిమాండ్‌కు తరలింపు

నిందితులను తమ వాహనంలో

తరలిస్తున్న కడప టూటౌన్‌ పోలీసులు

కడప కేంద్ర కారాగారం నుంచి బయటకు వస్తున్న రియాజ్‌, అతహవుల్లా

కడప అర్బన్‌: కడప నగర శివార్లలోని కేంద్ర కారాగారం వద్ద శుక్రవారం హైడ్రామా చోటు చేసుకుంది. కడప నగరం నకాష్‌కు చెందిన షేక్‌ రియాజ్‌ అలియాస్‌ షూటర్‌, పఠాన్‌ అతహవుల్లా అలియాస్‌ అతుల్‌ సెంట్రల్‌ జైలు నుంచి బెయిల్‌పై విడుదలవుతున్నారన్న సమాచారంతో అటు పోలీసులు.. ఇటు వారి బంధువులు అక్కడ మోహరించడంతో కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రియాజ్‌, అతహవుల్లాలను గత నెల 15న పోలీసులు గంజాయి కేసులో అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించిన విషయం తెలిసిందే. సదరు గంజాయి కేసులో ఈ నెల 15 వీరికి కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. కాగా అల్మాస్‌పేట ఘటనలోనూ వీరిని నిందితులుగా చేర్చిన పోలీసులు బయటికొస్తే అరెస్ట్‌ చేయాలని సెంట్రల్‌ జైలు వద్దే పడిగాపులు కాస్తూ వచ్చారు. అల్మాస్‌పేట సంఘటన జరిగిన సమయంలో తాము అక్కడ లేమని.. తమను ఈ కేసులో అన్యాయంగా ఇరికిస్తున్నారని రియాజ్‌, అతహవుల్లాలు తగిన సాక్ష్యాధారాలతో హైకోర్టులో హెబియస్‌కార్పస్‌ పిటీషన్‌ వేశారు. ఓ వైపు రాజకీయ ఒత్తిళ్లు.. మరోవైపు తమ అక్రమాలనే ప్రశ్నిస్తున్నారన్న అక్కసుతో సదరు నిందితులిద్దరినీ ఎలాగైనా అరెస్టు చేయాలనే ఉద్దేశంతో శుక్రవారం ఖాకీలు భారీగా మోహరించారు. ఈ నేపథ్యంలో నిందితుల తరఫున న్యాయవాదులు బెయిల్‌ ఉత్తర్వులు కేంద్ర కారాగార అధికారులకు అందజేయగా... షేక్‌ రియాజ్‌, పఠాన్‌ అతహవుల్లా కడప కేంద్రకారాగారం ప్రధాన ద్వారం నుంచి బయటకు వచ్చారు. ఆ మరుక్షణమే కడప టూటౌన్‌ సీఐ శ్రీహరి, తమ సిబ్బందితో కలిసి అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తీసు కెళ్లారు. సాయంత్రానికి వీరిని అరెస్ట్‌ చేసి మెజిస్ట్రేట్‌ ముందు హాజరుపరచగా.. ఆయన ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించారు. అల్మాస్‌పేట ఘటనకు తమ పిల్లలకు ఎలాంటి సంబంధం లేదని.. అన్యాయంగా కేసులో ఇరికించి అరెస్ట్‌ చేస్తున్నారనీ నిందితులకుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ ఒత్తిళ్లతోనే తమ పిల్లలపై పోలీసులు అక్ర మ కేసులను పెట్టి వేధిస్తున్నారని ఆరోపిస్తున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement