● చిన్నారి తల్లితోపాటు బంధువుల బైటాయింపు
పులివెందుల రూరల్ : పులివెందుల నియోజకవర్గం లింగాల మండలం లోపట్నూతల గ్రామంలో గురువారం నాలుగేళ్ల చిన్నారి నిత్విక దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. శుక్రవారం చిన్నారి తల్లి సృజన, బంధువులు, గ్రామస్తులు.. హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించి తమకు న్యాయం చేయాలంటూ పట్టణంలోని పూలంగళ్ల సర్కిల్‌లో బైటాయించారు. దీంతో అక్కడికి డీఎస్పీ మురళీ నాయక్, ఎస్‌ఐలు చేరుకుని మీకు న్యాయం జరిగే విధంగా చూస్తామని హామీ ఇవ్వడంతో బైటాయింపును విరమించారు. అనంతరం పులివెందులలోని డీఎస్పీ కార్యాలయంలో డీఎస్పీ మురళీ నాయక్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మృతురాలి తండ్రి రామాచారి కుటుంబానికి, అదే గ్రామానికి చెందిన వెంకట్రామిరెడ్డి కుటుంబానికి గత ఏడాది ఆగస్టు నెలలో చిన్న, చిన్న గొడవలు జరిగాయని, వీటి వల్ల మోటార్ బైక్ కాల్చిన సంఘటనలు కూడా జరిగాయన్నారు. దీనిపై అప్పట్లో పోలీసులు ఇరు వర్గాలకు చెందిన ఐదుగురిపై కేసు నమోదు చేశారన్నారు. ఇరు వర్గాలు ఎలాంటి గొడవలు పడకుండా వారి ఇళ్ల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. లింగాల ఎస్‌ఐ జగదీశ్వర్‌రెడ్డి, రూరల్ సీఐ శాంతి లాల్ ఆధ్వర్యంలో క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్‌తో.. హత్యా సంఘటనలో స్వాతి అనే మహిళనే కాకుండా ఇంకా ఎవరైనా ఉన్నారా అనే కోణంలో విచారణ చేస్తున్నట్లు తెలిపారు. నిందితులను కఠినంగా శిక్షిస్తామన్నారు. చిన్నారి తల్లి సృజన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ తెలిపారు.
మీ వల్లే మాకు న్యాయం జరగలేదు :
ఏడాది క్రితం జరిగిన గొడవల వల్లే ఇప్పుడు మా పాప ప్రాణాలు పోగొట్టుకోవాల్సి వచ్చిందని, అప్పుడే మీరు న్యాయంగా మాట్లాడి ఉంటే ఇప్పుడు ఇలా జరిగేది కాదని తుంగభద్ర ప్రాజెక్టు హైలెవెల్ కెనాల్ చైర్మన్ జోగిరెడ్డిని మృతురాలి తల్లి సృజన, బంధువులతోపాటు గ్రామస్తులు నిలదీశారు. మీరు సాక్ష్యాలను తారుమారు చేయడానికి ఇక్కడికి వచ్చారా, ఏడాది క్రితం జరిగిన గొడవలో వెంకట్రామిరెడ్డి, స్వాతిలకు టీడీపీ నాయకులు సపోర్ట్ చేయడం వల్ల చంపుకొనే వరకు దారి తీసిందని, ఆయనతో వాగ్వాదానికి దిగారు. పోలీసులు కూడా అధికార పార్టీకి ఒత్తాసు పలుకుతూ మా బంధువులను కూడా కొట్టేందుకు వచ్చారని వారు వాపోయారు. మీరేం మాకు న్యాయం చేయొద్దంటూ ఆయనపై వారు విరుచుకు పడ్డారు.


