లింగాల : లింగాల మండలం లోపట్నూతల గ్రామంలో గురువారం రాత్రి నిత్విక (4) అనే చిన్నారి హత్యకు పోలీసుల నిర్లక్ష్యమే కారణమని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. గత ఏడాది నుంచి రెండు కుటుంబాల మధ్య ఘర్షణలు చెలరేగుతుంటే.. కేవలం రామాచారి కుటుంబంపైనే పోలీసులు టార్గెట్ చేస్తూ వ్యవహరించడంతో.. వెంకట్రామిరెడ్డి కుటుంబ సభ్యులకు పోలీసులన్నా, రామాచారి కుటుంబమన్నా చులకన భావం ఏర్పడింది. పోలీసులు కూడా తమను ఏమి చేయలేరని, హత్యకు కారణమైన స్వాతి బంధువులు పోలీసు శాఖలో ఉన్నారన్న ధైర్యంతో ఈ అఘాయిత్యానికి పాల్పడిందని గ్రామ ప్రజలు విమర్శిస్తున్నారు. తరుచూ గొడవలు జరుగుతున్న సమయంలో.. పోలీసులు ఇరువురిపైన కఠిన చర్యలు తీసుకుని తగిన కౌన్సెలింగ్ ఇచ్చి ఉంటే ఈ హత్యా ఉదంతం జరిగి ఉండేది కాదని గ్రామస్తులు వాపోతున్నారు. సీసీ కెమెరాలు రెండు ఇళ్లకు అమర్చినా వాటి ఫుటేజీని చూడటంలో కూడా పోలీసులు అశ్రద్ధ వహించారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. తరుచూ రామాచారి ఇంటిపై వెంకట్రామిరెడ్డి కుటుంబ సభ్యులు దాడులు చేయడం, కలహాలకు దిగడం, కట్టెలు కాల్చివేయడం, బైకులను దహనం చేయడం, ఇంటి వెనుక పెంచుకున్న చెట్లను కాల్చి వేయడం వంటి చర్యలకు పాల్పడుతున్నా పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోకపోగా.. రామాచారిపైనే కేసులు బనాయించి కోర్టుల చుట్టూ తిప్పడం వల్ల రామాచారి కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. దీన్ని ఆసరాగా చేసుకుని వెంకట్రామిరెడ్డి భార్య స్వాతి.. చిన్నారి నిత్విక హత్య చేయడానికి తెగించిందనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. నిత్వికను కాలనీలో ఎవరూ లేని సమయం చూసి వెంట తీసుకెళ్లి పక్క బజార్‌లోని కృష్ణయ్య ఇంటి బయట ఉన్న బాత్రూంలోని నీటి డ్రమ్ములో ముంచి హత్య చేసినట్లు తెలుస్తోంది. దీనికి పోలీసుల నిర్లక్ష్యమే కారణమని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.


