రాజంపేట : ఆధ్యాత్మిక కేంద్రంగా తాళ్లపాక అభివృద్ధికి అన్ని చర్యలను తిరుమల తిరుపతి దేవస్థానం చేపట్టనున్నదని తిరుమల తిరుపతి దేవస్థానం డిప్యూటీ ఈవో ప్రశాంతి అన్నారు. శుక్రవారం పదకవితాపితామహుడు తాళ్లపాక అన్నమాచార్యుల జన్మస్థలి తాళ్లపాకను ఆమె సందర్శించి, అక్కడ చేపట్టవలసిన అభివృద్ధి అంశాలకు సంబంధించి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తాళ్లపాక అభివృద్ధిపై శ్రీశైలం పాలకమండలి బోర్డు చైర్మన్ పోతుగుంట రమేష్‌నాయుడు టీటీడీ ఈవోకు సమర్పించిన అభివృద్ధి పనులకు సంబంధించి అంశాలను పరిశీలించడం జరుగుతుందన్నారు. తాళ్లపాక ముఖద్వారం నుంచి అన్నమయ్య ధాన్యమందిర వరకు కవుల విగ్రహాల ఏర్పాటు, తాళ్లపాక చెరువులో అన్నమయ్య కీర్తనలు రాస్తున్నట్లుగా, శివలింగం ఏర్పాటుతోపాటు ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దాలని శ్రీశైలం చైర్మన్ కోరారన్నారు. వీటికి బోర్డు ఆమోదం తెలిపాల్సి ఉందన్నారు. ఆ తర్వాత పనులకు టెండర్లను పిలుస్తారన్నారు. అలాగే సిద్దేశ్వరస్వామి, చెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాల నిర్వహణ, ఏర్పాట్లకు సంబంధించి ఆమె దృష్టి సారించారు. 108 అన్నమయ్య అడుగుల విగ్రహం వద్ద టీటీడీ శ్రీవారి ఆలయ నిర్వహణ విషయంలో చెడ్డపేరు తీసురావద్దని టీటీడీ సిబ్బందికి డిప్యూటీ ఈవో హెచ్చరించారు. అంతకు ముందుగా శ్రీవారిని ఆమె దర్శించుకున్నారు. ఈమె వెంట ఆలయ సూపరింటెండెంట్ హనుమంతయ్య, తాళ్లపాక గ్రామస్తులు అదృష్ణదీపుడు, మోహనరావు, టీటీడీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


