● లింగాల కుడికాలువలో పడి బాలుడి మృతి
లింగాల : అయ్యో బిడ్డా.. అప్పుడే నీకు నూరేళ్లు నిండిపోయాయా.. అని తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్న తీరు చూపరుల్ని కలచివేసింది. లింగాల మండలం చిన్నకుడాల గ్రామంలో శుక్రవారం మధ్యాహ్నం ఎస్సీ కాలనీకి చెందిన అభిరామ్(5) అనే బాలుడు ప్రమాదవశాత్తు లింగాల కుడికాలువలో పడి మృతి చెందాడు. కాలనీకి చెందిన అరుణ్‌కుమార్, నాగమ్మల ఏకై క కుమారుడు అభిరామ్ మృతి చెందడంతో వారి రోదన ఆరణ్య రోదనగా మారింది. మధ్యాహ్న సమయంలో ఇంటి నుంచి తల్లిదండ్రులతో డబ్బులు ఇప్పించుకుని తన స్నేహితునితో కలిసి రోడ్డు సమీపంలో ఉన్న అంగడికి వెళ్లి తిండి పదార్థాలను తీసుకొని తిరిగి వస్తుండగా.. అక్కడ కాలువ సమీపంలోకి వెళ్లి కాలు జారి పడి పోయాడు. వెంటనే స్నేహితుడు పరుగున వెళ్లి బాలుడి తల్లిదండ్రులకు విషయాన్ని తెలిపారు. దీంతో అభిరామ్ తల్లిదండ్రులతోపాటు కాలనీ వాసులు అక్కడికి చేరుకుని కాలువలో పెరిగిపోయిన జమ్ములో ఇరుక్కుని ఉన్న అభిరామ్‌ను వెలికి తీశారు. వెంటనే పులివెందుల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. దీంతో చేసేదేమి లేక కుటుంబ సభ్యులు, బంధువులు బాలుడిని గ్రామానికి తరలించి అంత్యక్రియలు నిర్వహించారు.


