కనుమరుగుకానున్న రాజంపేట ఫారెస్టు డివిజన్...
● మూడుజిల్లాల్లో రాజంపేట ఫారెస్టు
● తేలని జిల్లాల అటవీ విభజన వ్యవహారం
● పత్తాలేని రీ ఆర్గనైజేషన్ కమిటీ
● ఆందోళనలో అటవీ సిబ్బంది
రాజంపేట: అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జించిన రాయలసీమలోని ఎర్రచందనానికి నిలయమైన రాజంపేట అటవీ డివిజన్ మూడు జిల్లాల పరిధిలో విస్తరించి ఉంది. దీంతో పాలనలో సందిగ్ధత నెలకొందన్న వాదన అటవీశాఖలోనే వినిపిస్తోంది. మూడు జిల్లాల్లో రాజంపేట అటవీ ప్రాంతం విస్తరించిన నేపథ్యంలో ఎవరి జిల్లా పాలన వారే చేయాలా..లేక ఇతర జిల్లాకు చెందిన పాలన రాజంపేటలోనే చేయాలా అన్న సందేహాలు తలెత్తుతున్నాయి. సమస్యను రాష్ట్ర ఉన్నతాధికారుల దృష్టి కి తీసుకెళ్లలేని పరిస్ధితిలో ఉన్నారని తెలుస్తోంది.
తేల్చని కూటమి ప్రభుత్వం...
అటవీపాలన విడ్డూరంగా తయారైందన్న విమర్శలున్నాయి. జిల్లా సరిహద్దులకు సంబంధించి కూడా రాష్ట్ర అటవీశాఖ ఉన్నతాధికారులు దృష్టి సారించలేదు. రాజంపేట, మార్కాపురం లాంటి ప్రాంతాల్లో పాలనకు సంబంధించి సమస్యలు తలెత్తున్నాయి. కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో రీ ఆర్గనైజేషన్ కమిటీని కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసినట్లు అటవీవర్గాలు చెపుతున్నాయి. ఆ కమిటీ పత్తాలేకుండా పోయింది. అటవీశాఖ మంత్రి.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా అటవీపాలనపై పట్టుకోల్పోతున్నారనే విమర్శలు అటవీవర్గాల నుంచి వినిపిస్తున్నాయి.
అటవీసిబ్బందిలో ప్రాంతీయ ఆందోళన
కొత్త జిల్లాల స్వరూపం మారిన నేపథ్యంలో రాజంపేట అటవీ డివిజన్ సిబ్బందిలో ప్రాంతీయ ఆందోళన నెలకొంది. ప్రస్తుతం పనిచేస్తున్న సిబ్బంది తమ విధులను మూడుజిల్లాలో అందిస్తున్నారు. ఏ జిల్లా పరిధిలో ఉంటే అక్కడేఊ జిల్లా అటవీశాఖాధికారి పర్యవేక్షణలో పాలన జరుగుతుంది. కానీ ఇప్పుడు ఆ పరిస్ధితులు కనిపించడంలేదు. తిరుపతి, అన్నమయ్య, కడప జిల్లాల పరిధిలో రాజంపేట ఫారెస్టు డివిజన్ ప్రాంతం ఉంది. రాజంపేట అటవీ డివిజన్ కడప జిల్లాలో ఉంది. డివిజన్‌కు చెందిన రేంజ్‌లు తిరుపతి, అన్నమయ్య, కడప జిల్లాలో ఉన్నాయి.
కడపలో అన్నమయ్య అటవీ జిల్లా కార్యాలయం..
అన్నమయ్య జిల్లా (మదనపల్లె)అటవీ కార్యాలయం వైఎస్సార్ కడప జిల్లాలో ఉంది. ఇక్కడి నుంచి పాలన కొనసాగుతోంది. అయితే ఈ కార్యాలయం జిల్లా కేంద్రమైన మదనపల్లెలో ఏర్పాటుకావాల్సి ఉంది. అక్కడి నుంచే జిల్లా అటవీపాలన కొనసాగించాల్సి ఉంటుందని అటవీ వర్గాలే అంటున్నాయి. ఇక్కడి అటవీ పాలన కడప డీఎఫ్‌ఓ పర్యవేక్షించాల్సి ఉంటుంది. కానీ అలా ఇప్పుడు జరగడంలేదని అటవీ వర్గాలు అంటున్నాయి.
రేంజ్ ఇక్కడ...జిల్లా అక్కడ...
రాజంపేట డివిజన్ పరిధిలో రేంజ్‌లు ఇక్కడ ఉన్నాయి. జిల్లా వేరుగా ఉంది. రైల్వేకోడూరు నియోజకవర్గం తిరుపతి జిల్లాలోకి వెళ్లిపోయింది. దీని పరిధిలో ఉన్న చిట్వేలి రేంజ్, రైల్వేకోడూరు సబ్‌డీఎఫ్‌ఓ, బాలపల్లె రేంజ్‌లు ఒకప్పుడు రాజంపేట ఫారెస్టు డివిజన్‌లో కొనసాగాయి. ఇప్పుడు ఈరేంజ్ తిరుపతి జిల్లా పరిధిలో ఉన్నాయి. ప్రస్తుతం అన్నమయ్య అటవీజిల్లాలో కొనసాగుతోంది. తిరుపతి డీఎప్‌ఓ కంట్రోల్‌లోకి ఈ రేంజ్‌లు వెళ్లాల్సి ఉంటుందని అటవీ వర్గాలు చెబుతున్నాయి. ఏ జిల్లాకు ..ఆ జిల్లా రేంజ్‌లను అప్పగిస్తే గందరగోళ పరిస్థితులు ఉండవని సిబ్బంది అంటున్నారు.
జిల్లా పరిధి రేంజ్‌లు
అన్నమయ్య పీలేరు, రాయచోటి, మదనపల్లె
కడప రాజంపేట, సానిపాయి
తిరుపతి చిట్వేలి, కోడూరు, బాలపల్లె
1966 నుంచి రాజంపేట ఫారెస్టు డివిజన్ కొనసాగింది. ముందుగా కడప జిల్లాలోనే ఉండేది. తిరిగి కడప జిల్లాలోకి వెళ్లింది. అయితే కొత్త జిల్లాల ఏర్పాటు క్రమంలో అన్నమయ్య జిల్లాలోకి రాజంపేట ఫారెస్టు డివిజన్ చేరింది. మళ్లీ ఇప్పుడు జిల్లాల విభజన క్రమంలో రాజంపేట ఫారెస్టు డివిజన్ కడపలోకి వెళ్లాల్సి ఉంటుంది. అయితే అన్నమయ్య జిల్లా అటవీ పాలన ఇక్కడి నుంచి కొనసాగుతోంది. ఇప్పటి వరకు ఐఎఫ్‌ఎస్‌ల రాజ్యం కొనసాగింది. డీఎఫ్‌ఓ కార్యాలయం సబ్‌డీఎఫ్‌ఓ కార్యాలయంగా మారనుందని సంకేతాలు వస్తున్నాయి.


