అరటిపై అగ్నివర్షం | - | Sakshi
Sakshi News home page

అరటిపై అగ్నివర్షం

Mar 13 2026 7:56 AM | Updated on Mar 13 2026 7:56 AM

దళారుల కబంధ హస్తాల్లో రైతులు

అన్నదాతపై యుద్ధ ‘పంజా’

ఒకవైపు ఎండల తీవ్రత.. మరోవైపు ఎగుమతులపై యుద్ధం సెగ! ఉమ్మడి కడప జిల్లాలోని అరటి, మామిడి రైతుల పరిస్థితి ఇప్పుడు ‘ముందు నుయ్యి.. వెనుక గొయ్యి’లా తయారైంది. హోలీ పండుగ వేళ మార్కెట్లు కళకళలాడాల్సిన తరుణంలో, పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ మేఘాలు జిల్లా ఉద్యానవన పంటలను నిట్టనిలువునా ముంచేశాయి. ఇరాన్‌ – ఇజ్రాయెల్‌ ఉద్రిక్తతల వల్ల హార్ముజ్‌ జలసంధి గుండా నౌకల రాకపోకలు స్తంభించిపోవడంతో, గల్ఫ్‌ దేశాలకు వెళ్లాల్సిన వందలాది టన్నుల అరటి నిల్వలు పోర్టుల్లోనే మగ్గిపోతున్నాయి. దిగుమతిదారులు వెనకంజ వేయడం, ఇదే అదునుగా దళారులు ధరలు తగ్గించేయడంతో రైతు కళ్ళల్లో కన్నీరు సుడిగుండంలా మారుతోంది.

రాజంపేట: అంతర్జాతీయ పరిణామాలు ఉమ్మడి కడప జిల్లాలోని ఉద్యానవన రైతుల పాలిట శాపంగా మారాయి. పశ్చిమాసియా (ఇరాన్‌ – ఇజ్రాయెల్‌) మధ్య నెలకొన్న యుద్ధ మేఘాలు జిల్లాలోని అరటి, మామిడి ఎగుమతులను పూర్తిగా స్తంభింపజేశాయి. ఏటా హోలీ పండుగ సీజన్‌లో ఆశించిన లాభాలు వస్తాయని భావించే రైతులకు, ఈసారి యుద్ధ వాతావరణం తీరని వేదనను మిగిల్చింది. ఎగుమతులు నిలిచిపోవడంతో జిల్లా నుంచి రోజూ జరిగే సుమారు 300 టన్నుల అరటి వ్యాపారం నిలిచిపోయింది. దీనివల్ల నిత్యం రూ. 2 కోట్ల నుంచి రూ. 3 కోట్ల మేర రైతులు నష్టపోతున్నారు.

ఎగుమతులకు మోక్షం ఏది?

జిల్లాలో పండే మేలురకం అరటికాయలకు అంతర్జాతీయ మార్కెట్‌లో మంచి గిరాకీ ఉంది. ముఖ్యంగా పులివెందుల నియోజకవర్గంలోని తొండూరు, వేముల, లింగాల మండలాల్లో సుమారు సాగు చేసే ‘జీ–9’ రకం అరటి కువైట్‌, యూఏఈ, ఇరాన్‌, యూకే దేశాలకు ఎగుమతి అవుతుంది. అయితే, ప్రస్తుతం హార్ముజ్‌ జలసంధి గుండా నౌకల రాకపోకలకు ఆటంకం కలగడంతో ఎగుమతులు నిలిచిపోయాయి. ఢిల్లీ నుంచి వచ్చి అనంతపురంలో మకాం వేసే వ్యాపారులు హోలీ పండుగకు 10 రోజుల ముందే వెళ్ళిపోవడం, అదే సమయంలో యుద్ధం ముంచుకురావడంతో కొనుగోలుదారులు కరువయ్యారు.

పాతాళానికి పడిపోయిన ధరలు

కేవలం పది రోజుల క్రితం వరకు టన్ను అరటి ధర రూ. 22,000 నుంచి రూ. 25,000 వరకు పలకగా, యుద్ధ ప్రభావంతో అది ఇప్పుడు రూ. 11,000 కు, కొన్ని చోట్ల రూ. 7,000 – 9,000 కు పడిపోయింది. ప్రస్తుతం రెండో కోత కోయాల్సిన సమయం కావడంతో, కనీసం రూ. 15,000 ధర వస్తేనే పెట్టుబడి అయినా దక్కుతుందని రైతులు ఆవేదన చెందుతున్నారు. పులివెందులలోని శీతల గిడ్డంగి సామర్థ్యం కేవలం 6,000 మెట్రిక్‌ టన్నులు మాత్రమే కావడంతో, దిగుబడిని నిల్వ చేసుకునే అవకాశం లేక రైతులు అడిగిన ధరకే అమ్ముకుంటున్నారు.

మామిడి రైతుకూ తప్పని కష్టాలు

గత మూడేళ్లుగా కరోనా, ఉక్రెయిన్‌ యుద్ధం వల్ల నష్టపోయిన మామిడి రైతులకు ఈ ఏడాది కూడా నిరాశే ఎదురవుతోంది. పూత, కాత ఆశాజనకంగా ఉన్నప్పటికీ, పశ్చిమాసియా ఉద్రిక్తతల వల్ల మామిడి గుజ్జు (పల్ప్‌) ఎగుమతులు నిలిచిపోయాయి. సౌదీ అరేబియా, ఒమన్‌ వంటి దేశాలకు వెళ్లాల్సిన 70 శాతం పల్ప్‌ నిల్వలు గోదాముల్లోనే బారల్స్‌కు పరిమితమయ్యాయి.

ఎగుమతులు ఆగిపోవడంతో దిగుబడి మొత్తం ఢిల్లీ, మహారాష్ట్ర, జమ్మూ కాశ్మీర్‌ వంటి దేశీయ మార్కెట్లకే పరిమితమైంది. ఇదే అదునుగా దళారులు రంగప్రవేశం చేసి ధరలను ఇష్టారాజ్యంగా తగ్గిస్తున్నారు. సుమారు 20 ప్రధాన ఏజెన్సీల ద్వారా తాడిపత్రి కంటైనర్ల నుండి ముంబై పోర్టుకు చేరిన కాయలు సైతం, షిప్పింగ్‌ అనుమతులు లేక పోర్టుల్లోనే మూలుగుతున్నాయి.

పశ్చిమాసియా ఉద్రిక్తతలతోకుదేలైన ఎగుమతులు

జిల్లా నుంచి నిలిచిన 300 టన్నుల లోడ్‌.. రోజుకు రూ. 3 కోట్ల వ్యాపారం చిన్నాభిన్నం

టన్ను రూ. 25 వేల నుంచిరూ.11 వేలకు పతనం

గల్ఫ్‌ దేశాలకు బ్రేక్‌.. నిల్వ సౌకర్యం లేకమగ్గిపోతున్న ‘జీ–9’ అరటి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement