పట్టాలు, పురస్కారాల వివరాలు
కడప ఎడ్యుకేషన్: యోగి వేమన విశ్వవిద్యాలయ (YVU) చరిత్రలో ఒక అరుదైన ఘట్టానికి ముహూర్తం ఖరారైంది. విద్యార్థి లోకం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘పట్టాల పండుగ’ (స్నాతకోత్సవం) శుక్రవారం వైభవంగా జరగనుంది. నాలుగేళ్లుగా (2020–24) పెండింగ్‌లో ఉన్న 11, 12, 13, 14వ స్నాతకోత్సవాలను ఒకేసారి నిర్వహించేందుకు వర్సి టీ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కడప– తిరుపతి బైపాస్ రోడ్డులోని డి.ఎస్.ఆర్ పారడైజ్ ఫంక్షన్ హాల్ ఈ చారిత్రక వేడుకకు వేదిక కానుంది.
గవర్నర్ రాక
విశ్వవిద్యాలయం ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిన స్నాతకోత్సవాలకు ఏ ఒక్క గవర్నర్ కూడా హాజరు కాలేదు. అయితే, ఈసారి రాష్ట్ర గవర్నర్ మరియు విశ్వవిద్యాలయ కులపతి జస్టిస్ ఎస్. అబ్దుల్ నజీర్ హాజరవుతుండటం విశేషం. గవర్నర్ రాక దృష్ట్యా పోలీసులు కడప ఎయిర్‌పోర్ట్ నుండి వేదిక వరకు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఉపకులపతి ఆచార్య బెల్లంకొండ రాజశేఖర్ అధ్యక్షత వహించనున్నారు.
విద్యార్థులకు సూచనలు – డ్రెస్ కోడ్
సమయం: విద్యార్థులు, తల్లిదండ్రులు ఉదయం 8:00 గంటల నుండి 9:30 గంటల లోపు తమకు కేటాయించిన సీట్లలో కూర్చోవాలి.
నిబంధనలు: సభా ప్రాంగణంలోకి మొబైల్ ఫోన్లు, కెమెరాలు, ఎలక్ట్రానిక్ వస్తువులకు అనుమతి లేదు. ఆహ్వాన పత్రం తప్పనిసరి.
ఉచిత బస్సు సౌకర్యం
విద్యార్థుల కోసం ఉదయం 8 గంటలకు కడప ఆర్టీసీ బస్టాండ్, ఓల్డ్ బస్టాండ్, ఇర్కాన్ సర్కిల్ నుంచి ఉచిత బస్సులను ఏర్పాటు చేశారు. ఏదైనా సందేహాల కోసం 7981755635, 9000488637, 8919151738 నంబర్లను సంప్రదించవచ్చు.
ఏర్పాట్లను పరిశీలించిన జేసీ నిధి మీనా
కడపలోని డీఎస్‌ఆర్ ఫంక్షన్ హాల్‌లో జరుగుతున్న స్నాతకోత్సవ ఏర్పాట్లను జేసీ నిధి మీనా గురువారం పరిశీలించారు. ఈ వేడుకకు గవర్నర్ హాజరుకానున్నందున, ప్రోటోకాల్ ప్రకారం కట్టుదిట్టమైన భద్రత కల్పించాలని పోలీసులను ఆదేశించారు. సబ్ కలెక్టర్ భావన, కేఎంసీ కమిషనర్ రాకేష్ పాల్గొన్నారు.
విజయవాడలోని లోక్ భవన్‌లో రాష్ట్ర గవర్నర్, కులపతి ఎస్. అబ్దుల్ నజీర్ ను యోగి వేమన విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య బెల్లంకొండ రాజశేఖర్ గురువారం కలసి స్నాతకోత్సవానికి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మొక్కను అందజేసి స్వాగతం పలికారు.
ఈ మెగా స్నాతకోత్సవంలో మొత్తం 12,858 మంది విద్యార్థులు పట్టాలను
అందుకోనున్నారు.
పీజీ పట్టభద్రులు: 1,194 మంది.
డిగ్రీ విద్యార్థులు: 11,664 మంది.
డాక్టరేట్లు (PhD): 70 మంది పరిశోధక విద్యార్థులకు.
బంగారు పతకాలు: ప్రతిభ కనబరిచిన 176 మంది విద్యార్థులకు గవర్నర్ చేతుల మీదుగా గోల్డ్ మెడల్స్ అందజేయనున్నారు.
గౌరవ డాక్టరేట్లు: శాస్త్ర సాంకేతిక రంగాలలో నిష్ణాతులైన డాక్టర్ కోట హరినారాయణ, డాక్టర్ శేఖర్ సి. మండేలకు గౌరవ డాక్టరేట్లను ప్రదానం చేయనున్నారు.
వైవీయూలో చారిత్రక స్నాతకోత్సవానికి సర్వం సిద్ధం
తొలిసారి హాజరుకానున్న రాష్ట్ర గవర్నర్ జస్టిస్ ఎస్. అబ్దుల్ నజీర్
12,858 మంది విద్యార్థులకుపట్టాల ప్రధానం.. 176 మందికి బంగారు పతకాలు


