19 నుంచి కడప రాయుడి బ్రహ్మోత్సవాలు
కడప సెవెన్‌రోడ్స్: తిరుమల తొలిగడప దేవునికడప శ్రీ లక్ష్మీవేంకటేశ్వరస్వామి ఆలయంలో ఈనెల 19 నుంచి 27వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించనున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. ఈ మేరకు వివరాలు వెల్లడించారు. ఈనెల 18వ తేదీ సాయంత్రం 6 నుంచి రాత్రి 8 గంటల మధ్య అంకురార్పణతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. ఉత్సవాల్లో భాగంగా ఈనెల 24వ తేది ఉదయం 10.30 గంటలకు స్వామి వారి కల్యాణోత్సవం ఉంటుందని వివరించారు. గృహస్తులు రూ.300 చెల్లించి కల్యాణోత్సవంలో పాల్గొనవచ్చన్నారు. జనవరి 28న సాయంత్రం 6 గంటలకు పుష్పయాగం జరుగుతుందని వివరించారు. వాహన సేవలలో భాగంగా శ్రీలక్ష్మీ వేంకటేశ్వర స్వామి వారు ఉదయం 9.00 నుంచి 10.00 గంటల వరకు, రాత్రి 8.00 నుంచి9.00 గంటల వరకు మాడవీధుల్లో విహరించి భక్తులను అనుగ్రహిస్తారన్నారు. ఈ సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ప్రతిరోజు హరికథలు, భక్తి సంగీత ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు.
24న దేవదేవుని కల్యాణోత్సవం
25న రథోత్సవం


