‘సీమ’కు మైక్రోసాఫ్ట్ పెట్టుబడులు తీసుకు రండి
● గుజరాత్‌కు తరలిపోతున్నాయ్
● బాబూ....ఆర్‌ఎస్‌ఎస్ అధినేతతో కాదు..సత్య నాదెళ్లతో మాట్లాడు
● కేంద్ర మాజీమంత్రి చింతా మోహన్
కడప సెవెన్‌రోడ్స్ : అత్యంత వెనుకబడిన రాయలసీమ ప్రాంతానికి మైక్రోసాఫ్ట్ పెట్టుబడులు తీసుకు వచ్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి చేయాలని మాజీ కేంద్ర మంత్రి చింతా మోహన్ కోరారు. కడపలోని ప్రెస్‌క్లబ్‌లో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. మైక్రో సాఫ్ట్ సీఈఓ సత్యనాదెళ్ల రూ. 10 లక్షల కోట్ల పెట్టుబడులు దేశంలో పెట్టేందుకు ఆసక్తిగా ఉన్నారని, ఈ విషయాన్ని ఆయన ప్రధానమంత్రి నరేంద్రమోదీ దృష్టికి తీసుకెళ్లారన్నారు. అయితే ప్రధాని ఆ పెట్టుబడులను గుజరాత్‌కు తరలించుకు వెళుతున్నారని వెల్లడించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మద్దతుతోనే ఈరోజు మోదీ ప్రధానిగా ఉన్నారని పేర్కొన్నారు. కనుక చంద్రబాబు తక్షణమే పెట్టుబడులు గుజరాత్‌కు తరలిపోకుండా రాయలసీమకు తీసుకొచ్చేందుకు కృషి చేయాలన్నారు. తిరుపతిలో ఆర్‌ఎస్‌ఎస్ అధినేత మోహన్ భగవత్‌తో ఇతర అంశాలపై మాట్లాడటం కాదని, మైక్రో సాఫ్ట్ సీఈఓ సత్యనాదెళ్లతో మాట్లాడి పెట్టుబడులు తీసుకు రావాలన్నారు.సత్య నాదెళ్ల తల్లి రాజంపేట వాసి కాగా, తండ్రి తాడిపత్రి ప్రాంతానికి చెందిన వ్యక్తి అని తెలిపారు. ఆయన రాయలసీమకు చెందిన వ్యక్తే గనుక ముఖ్యమంత్రి స్వయంగా మాట్లాడితే ఈ ప్రాంతానికి రూ.లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంటుందన్నారు. ఇంజినీరింగ్, ఎంబీఏ వంటి ఉన్నత చదువులు చదివి ఎంతోమంది నిరుద్యోగులుగా ఉన్నారని, పెట్టుబడులు వస్తే అందరికీ ఉపాధి లభించి ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందన్నారు. రాయలసీమకు చెందిన ఏడుగురు ముఖ్యమంత్రులుగా రాష్ట్రాన్ని పాలించినా ఈ ప్రాంతం వెనుకబడే ఉందని తెలిపారు. రాష్ట్ర విభజన సమయంలో రాయల తెలంగాణ గురించి తానే ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్ దృష్టికి తీసుకు వెళ్లానని, అయితే తన ప్రయత్నాన్ని కొందరు అడ్డుకున్నారని తెలిపారు. పోలవరం, బనకచర్ల ఇప్పట్లో పూర్తి కావని, అవి పూర్తి అయినప్పటికీ పేదలకు పెద్ద ప్రయోజనం ఉండదన్నారు. పెట్టుబడులు వస్తేనే సీమ ప్రాంతం అభివృద్ధి చెందుతుందన్నారు. యూపీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన ఉపాధి హామీ పథకంలోని మహాత్మాగాంధీ పేరు తొలగింపు సరికాదన్నారు. కూలీ రేట్లు తగ్గించడం ద్వారా కార్పొరేట్లకు లాభం చేకూర్చేందుకు ఎన్డీయే ప్రభుత్వం చట్టాన్ని మార్పు చేసిందని విమర్శించారు.


