కోట్ల రూపాయల స్థలంపై కన్ను
ఓబులవారిపల్లె : రైల్వేకోడూరు పట్టణ నడిబొడ్డు లక్ష్మీనగర్‌లో పెత్తందారులు ఎలాంటి పత్రాలు లేకుండా అక్రమంగా ఆన్‌లైన్ చేయించి దళితవాడ గ్రామస్తులను పురమాయించి కోట్ల రూపాయల పేదల ఇంటి స్థలాలను కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. దశాబ్దాల క్రితం సర్వే నంబరు. 7/3, 7/4, 7/5, 13/1ఎ సర్వే నంబర్లలో దాదాపు ఆరు ఎకరాల భూమిలో ఇంటి స్థలాలను దళితులు, నాయీబ్రాహ్మణ తదితర కులాలకు చెందిన వారు వందమందికి పైగా కొనుగోలు చేశారు. అప్పటి నుంచి వాళ్ల ఆధీనంలో ఉంది. అయితే కొందరు భూ బకాసురులకు కోట్ల రూపాయల స్థలంపై కన్ను పడింది. 2017వ సంవత్సరంలో అక్రమంగా ఆన్‌లైన్ చేయించుకొని కోడూరు దళితవాడ గ్రామస్తులతో కలిసి దౌర్జన్యం చేస్తున్నారు. ప్రస్తుత జిల్లా కలెక్టర్, రెవెన్యూ అధికారులు, రాజంపేట ఎస్పీ ఈ విషయంపై క్షేత్రస్థాయిలో విచారించి పేదల పక్షాన నిలబడ్డారు. అయితే కొందరు పెత్తందారులు కోడూరు దళితవాడ గ్రామస్తులను ఉసిగొలిపి వారివద్ద ఎలాంవంటి పత్రాలు లేకున్నా కూడా పేదల స్థలాల్లోకి రానివ్వకుండా దౌర్జన్యం చేస్తూ భయబ్రాంతులకు గురి చేస్తున్నారు. రెవెన్యూ, పోలీసు అధికారులను సైతం లెక్కచేయకుండా తిరగబడుతున్నారు. గురువారం ఈ సర్వే నంబర్లలో నీటి పైపులైను రోడ్డు వేస్తున్న అధికారులను, స్థల యజమానులను బెదిరించి గొడవలకు పాల్పడ్డారు. వారివద్ద పత్రాలు తీసుకురమ్మని ఎన్ని మాటలు చెప్పినా మా తాతల భూమి అంటూ ఎలాంటి ఆధారాలు లేకుండా బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఈ విషయంపై ఇప్పటికే పలుమార్లు తెలుగుదేశం పార్టీ ఇన్‌చార్జి ముక్కా రూపానందరెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ఉన్నతాధికారులు పరిశీలించి పేద కుటుంబాలకు న్యాయం చేయాలని స్థానికులు కోరుతున్నారు.
కోట్ల రూపాయల స్థలంపై కన్ను


