శ్రీరామ మహా శోభాయాత్ర నిర్వహణకు ప్రణాళిక
● జనవరి 21న కల్యాణం
● 22న శోభాయాత్ర
కడప సెవెన్‌రోడ్స్ : కడప గడపలో మూడవ శ్రీరామ మహా శోభాయాత్రను వైభవంగా నిర్వహించేందుకు పకడ్బందీ కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. గురువారం హౌసింగ్‌బోర్డు కాలనీలోని శ్రీ కోదండ రామాలయంలోఅయోధ్య ఐక్యవేదిక ప్రతినిధి దేసు వెంకటరెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో నగర ప్రముఖులు, వివిధ ధార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు. జనవరి 21వ తేదీ సాయంత్రం 5.00 గంటలకు మున్సిపల్ మైదానంలో శ్రీ సీతారాముల కల్యాణాన్ని సాంస్కృతిక కార్యక్రమాల నడుమ కమనీయంగా నిర్వహిచేందుకు అవసరమైన ఏర్పాట్ల గురించి సమావేశంలో చర్చించారు. మరుసటిరోజు జరిగే శ్రీరామ మహా శోభాయాత్ర రూట్ మ్యాప్ సిద్ధం చేశారు. భజన బృందాలు, కోలాటాలు, భజరంగి విన్యాసాలు, కేరళ వాయిద్యాలు, పిల్లన గ్రోవి, తప్పెట దరువులు, రాజస్తానీ యువకుల డప్పు వాయిద్యాలు, మరెన్నో ఆకట్టుకునే సాంస్కృతిక కార్యక్రమాలతో శోభాయాత్ర శోభాయమానంగా కొనసాగించాలని నిర్ణయించారు.
విస్తృత ప్రచారం
సీతారామ కల్యాణం, మహా శోభాయాత్ర గురించి ఇప్పటికే నగరంలోని దాదాపు అన్ని ఆలయాల వద్ద ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. కల్యాణం, శోభాయాత్ర విజయవంతానికి పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు. వీటి నిర్వహణకు అవసరమయ్యే నిధుల సమీకరణగురించి సమావేశంలో చర్చించారు. శోభాయాత్రకు ఎప్పటిలాగా వేల సంఖ్యలో ప్రజలు తరలివచ్చే అవకాశం ఉన్నందున ఎవరికీ ఎలాంటి అసౌకర్యం కలగకుండా తీసుకోవాల్సిన, చేయాల్సిన ఏర్పాట్లపై సమావేశంలో పలువురు తమ అభిప్రాయాలు వెలిబుచ్చారు. ఈ సందర్బంగా కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో కడప వ్యవసాయ మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షుడు సుబ్బారెడ్డి, కార్పొరేటర్లు సుదర్శన్‌రెడ్డి, సూర్యనారాయణరావు, వీహెచ్‌పీ జిల్లా అధ్యక్షుడు చెన్నకృష్ణారెడ్డి, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ అందూరి రామకృష్ణారెడ్డి, బీజేపీ నేత బాలకృష్ణయాదవ్, దేవతి శంకరయ్య, కడప ఎమ్మెల్యే తనయుడు శ్రావణ్‌రాజ్ రెడ్డి, మాజీ కో ఆప్షన్ సభ్యుడు వేణుగోపాల్‌రెడ్డితోపాటు పలువురు నగర ప్రముఖులు, ధార్మిక సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
మహా శోభయాత్రకు పూర్తి సహకారం
– నగర మేయర్ పాకా సురేష్‌కుమార్
శ్రీరామ మహా శోభాయాత్రకు కార్పొరేషన్ తరపున పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని నగర మేయర్ పాకా సురేష్‌కుమార్ తెలిపారు. శ్రీ రామ శోభాయాత్రకు కడప నగరంలోని మున్సిపల్ స్టేడియంలో కళ్యాణోత్సవం, శానిటేషన్, ప్రతి సర్కిల్‌లో లైటింగ్ సదుపాయాన్ని కల్పిస్తామన్నారు.


