బోయనపల్లెలో బీహారీల గంజాయి!
రాజంపేట : రాజంపేట మండలం బోయనపల్లె (కడప–రేణిగుంట జాతీయ రహదారి)లో గంజాయి స్మగ్లింగ్ గుట్టురట్టయింది. బోయనపల్లెను వీడని గంజాయివాసన అనే శీర్షికతో సాక్షిలో కథనం ప్రచురితమైన విషయం విదితమే. కొద్దిరోజుల క్రితం గంజాయి మత్తులో కొంతమంది యువకులు నేరాలకు పాల్పడిన సంఘటనలతో మన్నూరు పోలీసులు అప్రమత్తమయ్యారు.
సీఐ ప్రసాద్‌బాబు నేతృత్వంలో..
మన్నూరు సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ప్రసాద్‌బాబు నేతృత్వంలో పోలీసులు బోయనపల్లెలో గంజాయి అమ్మకాలపై దృష్టి సారించారు. సీఐ కథనం మేరకు వివరాలు ఇలా...బీహార్ రాష్ట్రం ముజఫర్ జిల్లా సాధూలేపూర్ గ్రామానికి చెందిన రంజిత్ కుమార్, తిరుపతి జిల్లా వడమాలపేట, లక్ష్మీపురానికి చెందిన రావెళ్ల మోహన్, బీహార్‌కు చెందిన మహదేవచౌదరి, రైల్వేకోడూరు మండలం సమతానగర్‌కు చెందిన మాడగడపాల దియా, పుల్లంపేటకు చెందిన దాసరి తరుణ్, పుల్లంపేట మండల దళవాయిపల్లెకు చెందిన కట్టే ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, రాజంపేట మండలం ఇసుకపల్లె లక్ష్మీపురానికి చెందిన పిడుగు అజయ్‌లు బోయనపల్లెలో గంజాయి రవాణా, అమ్మకాలకు కారణంగా పోలీసులు గుర్తించారు. వీరి వద్ద నుంచి పది కేజీల గంజాయి, ఆరుసెల్‌ఫోన్‌లు, రూ.3వేల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఏడుగురిని అరెస్టు చేసిన రిమాండ్ నిమిత్తం రాజంపేట కోర్టుకు పంపించారు.
నేరమిలా..
గంజాయి కేసులో బీహార్‌కు చెందిన వారు ఇతర రాష్ట్రాల నుంచి పెద్దమొత్తంలో గంజాయిని తీసుకురావడం కొనసాగుతూ వచ్చింది. తిరుపతి జిల్లా వడమాలపేటలో డాబా నడుపుతూ, వాహనాల డ్రైవర్ల ద్వారా చుట్టూ ప్రాంతాల వారికి రవాణా చేస్తున్నారు. స్థానికంగా పంపిణీ చేసుకుంటున్నారు. వినియోగదారులకు విక్రయం వంటి విధానం వల్ల గంజాయి స్మగ్లింగ్ వ్యవహారం పోలీసులు విచారణలో బహిర్గతమైంది. గంజాయి పట్టివేతలో సీఐ ప్రసాద్‌బాబు, పోలీసుల ప్రతిభకు ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు లభించాయి.
ఏడుగురిని అరెస్టు చేసిన మన్నూరు పోలీసులు


