అగస్త్యేశ్వరా.. ఆభరణాలు ఏవీ !
ప్రొద్దుటూరు కల్చరల్ : స్థానిక అగస్త్యేశ్వరస్వామి ఆలయంలో స్వామివారి ఆభరణాలలో కొన్ని ఆభరణాలు మాయమయ్యాయి. ఈ మేరకు దేవదాయశాఖ రాయలసీమ జోన్ జ్యూవెలరీ వెరిఫికేషన్ ఆఫీసర్ పాండురంగారెడ్డి నిర్ధారించారు. రెండవ రోజు మంగళవారం ఆభరణాల తనిఖీ పూర్తి చేసిన తరువాత విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రికార్డుల మేరకు ఉన్న ఆభరణాలలో 28.30 గ్రాముల బంగారు, 264.900 గ్రాముల వెండి ఆభరణాలు కనిపించడం లేదని స్పష్టం చేశారు. వాటి విలువ రూ.3.20 లక్షలు ఉంటుదన్నారు. అలాగే భక్తులు స్వామివారికి కానుకల రూపంలో హుండీలో సమర్పించిన 2.129 కిలోల వెండి, 3.100 గ్రాముల బంగారు ఆభరణాలను రికార్డుల్లో నమోదు చేయలేదన్నారు. స్వామివారి ఆభరణాలు 15 రోజుల్లో రికవరీ చేయాలని లేదంటే క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆలయ ఈఓ వెంకటసుబ్బయ్యను ఆదేశించారు. ఈఓ వెంకటసుబ్బయ్య మాట్లాడుతూ తాను ఈ ఏడాది జూన్ 1వ తేదీన ఈఓగా బాధ్యతలు చేపట్టానని తనకన్నా ముందు ఉన్న ఈఓ రామచంద్రాచార్యులు స్వామివారి, బంగారు, వెండి ఆభరణాలను తనకు అప్పగించలేదన్నారు. దీనిపై నోటీసులు ఇచ్చినా స్పందించక పోవడంతో ఆయనకు షోకాజ్ నోటీసు జారీ చేశామన్నారు. ఆభరణాలను తనిఖీ చేయాలని లేఖ రాయడంతో తనిఖీ నిర్వహించారని, తనపై ఆరోపణలు రావడం విచారకరమన్నారు. తాను వచ్చినప్పటి నుంచి చేసిన ఖర్చులకు రికార్డులు చూపిస్తానన్నారు. రిటైర్డ్ ఈఓ రామచంద్రాచార్యులు మాట్లాడుతూ తాను 2016లో ఒకసారి, 2024లో ఒకసారి ఆలయ ఈఓగా పనిచేశానన్నారు. ఉన్నతాధికారుల అనుమతి, పాలకమండలి నిర్ణయం మేరకు ఆలయ నిధులను ఖర్చుచేస్తామని తెలిపారు. తనకన్నా ముందు ఉన్న ఈఓ శంకరబాలాజీ రెండు ఆభరణాలు తనకు అప్పగించలేదని దానికి ఆయనే బాధ్యుడని పేర్కొన్నారు. ఆలయ చైర్మన్ వంగల నారాయణ రెడ్డి మాట్లాడుతూ తాను చైర్మన్ అయి న తరువాత రికార్డులను పరిశీలించానని స్వామి వారి నిధులలో భారీగా అవకతవకలు జరిగాయని గుర్తించామన్నారు. ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పూర్తిస్థాయిలో విచారించిన తరువాత బాధ్యులపై కేసు నమోదు చేస్తామ న్నారు. సుదీర్ఘ కాలంగా జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న శివప్రసాద్‌పై ఆభరణాల గోల్‌మాల్, నిధుల దుర్వినియోగంపై ఆరోపణలు వినిపిస్తున్నాయన్నారు. కార్యక్రమంలో అప్రైజర్ మాధవస్వామి, ఇన్‌స్పెక్టర్ కిరణ్‌కుమార్‌రెడ్డి, పాలకమండలి సభ్యులు, అర్చకులు, భక్తులు పాల్గొన్నారు.
28.30 గ్రాముల బంగారు, 264.900 గ్రాముల వెండి ఆభరణాలు మాయం
రికార్డుల్లో నమోదు కాని
2.129 కిలోల వెండి,
3.100 గ్రాముల బంగారు ఆభరణాలు


