ప్రమాద రహిత సంస్థగా ఆర్టీసీ
కడప కోటిరెడ్డిసర్కిల్: ప్రమాద రహిత సంస్థగా ఆర్టీసీకి పేరుందని, ఆ పేరును నిలబెట్టేందుకు డ్రైవర్లు కృషి చేయాలని జిల్లా ప్రజా రవాణాధికారి పొలిమేర గోపాల్‌రెడ్డి సూచించారు. మంగళవారం కడప నగరంలోని ఆర్టీసీ ఆర్‌ఎం కార్యాలయ కాన్ఫరెన్స్ హాలులో ప్రమాదాలు చేసిన డ్రైవర్లకు శిక్షణా తరగతులు నిర్వహించారు. తొలుత ఓం శాంతి సంస్థ ప్రతినిధి ప్రదీప అక్కయ్య మానసిక ప్రశాంతత కోసం ధ్యానం చేయాల్సిన అవసరాన్ని తెలియజేసి డ్రైవర్లచేత కొద్దిసేపు ధ్యానం చేయించారు. అనంతరం గోపాల్‌రెడ్డి మాట్లాడుతూ డ్రైవర్లు విధి నిర్వహణలో నిరంతరం అప్రమత్తంగా ఉండాలన్నారు. డ్రైవర్ల తీరుపైనే సంస్థ పురోగతి ఆధారపడి ఉందన్నారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ప్రమాదాలపై దిశా నిర్దేశం చేశారు. బద్వేలు డిపో మేనేజర్ నిరంజన్ ఇంధన పొదుపుపై పంచ సూత్రాలు, జాగ్రత్తలను వివరించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ అధికారులతోపాటు వివిధ డిపోలకు చెందిన 18 మంది డ్రైవర్లు, కండక్టర్లు పాల్గొన్నారు.
జిల్లా ప్రజా రవాణాధికారి గోపాల్‌రెడ్డి


