
వైభవంగా ఆరోగ్యమాత ఉత్సవాల ప్రారంభం
కడప సెవెన్‌రోడ్స్: కడప నగరం రైల్వేస్టేషన్ రోడ్డులోని ఆరోగ్యమాత పుణ్యక్షేత్రంలో తిరునాల మహోత్సవాలు శుక్రవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. బిషప్ సగినాల పాల్ ప్రకాశ్ పతాకాన్ని ఎగురవేసి ఉత్సవాలను ప్రారంభించారు. అనంతరం శాంతి కోసం పావురాన్ని ఎగురవేశారు. ఈ సందర్భంగా బిషప్ దివ్యబలిపూజ సమర్పించి మాట్లాడారు. తిరునాల ఉత్సవాలు ఘనంగా, సవ్యంగా సాగాలని కోరారు. ప్రజలంతా శాంతి సమాధానాలతో ఉండాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. దేవుడు ప్రజలు ప్రార్థనలు ఆలకించి వారి అభీష్టాలను నెరవేర్చాలని కోరుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో రెవరెండ్ ఫాదర్ ఎండీ ప్రసాద్‌రావుతోపాటు ఫాదర్ ఎ.జోసెఫ్‌రాజు, డీన్ రెవరెండ్ ఫాదర్ ఎస్.సురేష్, విచారణ ప్రెసిడెంట్ విక్టర్, కార్యదర్శి సెబాస్టియన్, ఆర్థిక కార్యదర్శి జి.ఆనందరావు, డయాసిస్ గురువులు, ఆరోగ్యమాత, జేయంజె, క్రీస్తు జ్యోతి సిస్టర్స్, తిరునాల కమి టీ పెద్దలు, పెద్ద సంఖ్యలో విశ్వాసులు పాల్గొన్నారు.