
లంబో‘ధర’ లడ్డూ
మైదుకూరు: లంబోదరుడి లడ్డూ ప్రసాదానికి యమ డిమాండ్ ఉంది. రూ.లక్షల్లో ధర పలుకుతోంది. వినాయక చవితి ఉత్సవాల్లో మూడో రోజైన శుక్రవారం భారీగా వేలం పాటలు నిర్వహించారు. పలువురు భక్తులు పోటీ పడి దక్కించుకున్నారు. అలాగే పూజ సామగ్రిని పొందేందుకు అమితాసక్తి కనబరిచారు. స్వామి వారి ప్రసాదం, పూజ సామగ్రి అందడం తమ అదృష్టంగా భావిస్తున్నామని వారు తెలిపారు. మండపం నుంచి ఊరేగింపుగా తీసుకెళ్లి భక్తులకు పంపిణీ చేశారు. వైఎస్‌ఆర్, అన్నమయ్య జిల్లాలో ఈ పరిస్థితి కనిపించడం విశేషం.
● మైదుకూరు మండలంలోని అన్నలూరు అరవింద్‌నగర్‌లో అదే గ్రామానికి చెందిన కల్లూరి రామిరెడ్డి 10 కిలోల లడ్డూను రూ.4 లక్షలకు సొంతం చేసుకున్నారు. తోట వెంకటరామిరెడ్డి 15 గ్రాముల వెండి కాయిన్‌ను రూ.1.20 లక్షలకు పొందారు. మండలంలోని తిప్పిరెడ్డిపల్లెలో కొండిశెట్టి బాలుడు రూ.14 వేలకు చెరకు గడలను కై వసం చేసుకున్నారు. మైదుకూరులోని శీలం నగర్‌లో లడ్డూ ప్రసాదాన్ని మున్సిపల్ చైర్మన్ మాచనూరు చంద్ర, ఆయన కుమారుడు మాచనూరు సాగర్ రూ.2.16 లక్షలకు పాట పాడి దక్కించుకున్నారు.
● వీరపునాయునిపల్లెలోని నడివీధి గంగమ్మ ఆలయం వద్ద ఏర్పాటు చేసిన వినాయకుని లడ్డూను నర్రెడ్డి అరున్‌కుమార్‌రెడ్డి 2.35 లక్షలకు దక్కించుకున్నారు.
● బద్వేలు పట్టణం తెలుగుగంగ రోడ్డులోని నారాయణ స్కూల్ దగ్గర వినాయక విగ్రహం లడ్డూను రూ.1.89 లక్షలకు మణ్యం శంకర్‌రెడ్డి వశం చేసుకున్నారు.