
చంద్రబాబు మోసాలపై ప్రజల్లో ఆగ్రహం
పులివెందుల: రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు మోసాలపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోందని కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక భాకరాపురంలోని వైఎస్ జగన్ క్యాంపు కార్యాలయంలో ఆయన మాట్లాడారు. ఎన్నికలప్పుడు అమలు సాధ్యం కాని అనేక హామీలను చంద్రబాబు నాయుడు ఇచ్చారన్నారు. సూపర్ సిక్స్ పథకాలు అంటూ కూటమితోపాటు ఎల్లో మీడియా విపరీతంగా ప్రచారం చేసిందన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే హామీల అమలు అంటూ రాష్ట్రంలోని ప్రతి ఇంటికి బాండ్లు పంపిణీ చేశారన్నారు.
ఏడాది దాటిపోయినా ఒక్క హామీని కూడా పూర్తిగా అమలు చేయలేదని విమర్శించారు. ప్రతి మహిళకు ఏడాదికి రూ.18 వేలు, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఊసే లేదన్నారు. ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లలో ఒక్క సిలిండర్ కూడా సరిగా ఇవ్వడం లేదన్నారు. ఉచిత బస్సు పథకాన్ని కొన్ని బస్సులకు మాత్రమే పరిమితం చేశారన్నారు. అమరావతి అభివృద్ధి అంటూ ప్రజలను మభ్యపెట్టడం జరుగుతోందన్నారు. చంద్రబాబు నాయుడు చేస్తున్న మోసాలు, ఆరాచకాలను రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారని, ప్రజలు ఆయనకు సరైన సమయంలో బుద్ధి చెబుతారన్నారు. అనంతరం ఆయన ప్రజా దర్బార్ నిర్వహించారు. ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు. వారి సమస్యలు అడిగి తెలుసుకుని, పరిష్కారానికి కృషి చేశారు.
ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి