
కాల్వలో పడిన గేదెలు.. కాపాడిన ఫైర్ సిబ్బంది
బద్వేలు అర్బన్ : స్థానిక నెల్లూరు రోడ్డులోని సుజుకి షోరూమ్ సమీపంలో బుధవారం ప్రమాదవశాత్తూ రెండు గేదెలు మురుగు కాలువలో పడ్డాయి. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది, స్థానికులు అరగంట పాటు శ్రమించి గేదెలను బయటకు తీశారు. కొండారెడ్డివీధిలో నివసిస్తున్న పెంచల్ రెడ్డికి చెందిన మూడు గేదెలను మేతకు తీసుకెళుతుండగా నెల్లూరు రోడ్డులోని సుజుకి సమీపంలోని డ్రైనేజీ కాలువలో పడ్డాయి. గేదెల యజమాని వాటిని బయటికి తీసేందుకు స్థానికుల సహకారంతో గంటసేపు ప్రయత్నించినప్పటికీ సాధ్యపడలేదు. దీంతో అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో ఫైర్ ఆఫీసర్ చంద్రుడు ఆధ్వర్యంలో లీడింగ్ ఫైర్‌మెన్ హరిక్రిష్ణ, ఫైర్‌మెన్లు పాములేటి నాయక్, మాబురెడ్డి, స్థానికులతో కలిసి అతికష్టం మీద గేదెలను బయటికి తీశారు. అయితే సంబంధిత డ్రైనేజీపై ఉన్న కల్వర్టును ఇటీవల తొలగించడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు వాపోయారు.