
● ఇంటి పట్టాల కోసం ఇచ్చిన భూమి సైతం...
నంద్యాలంపేట సర్వే నంబర్ 854/1, సర్వే నంబర్ 840లో
ప్రభుత్వ భూమి చదును చేసిన టీడీపీ నేతలు
సాక్షి ప్రతినిధి, కడప: మైదుకూరు నియోజకవర్గంలో తెలుగుతమ్ముళ్లు అక్రమార్కుల అవతారమెత్తారు. చెరువులు, వాగులు, పోరంబోకు ప్రభుత్వ భూములను చెరబట్టారు. అధికార పార్టీ ఎమ్మెల్యే పేరు చెబుతూ అక్రమంగా స్వాధీనం చేసుకుంటున్నారు. జాండ్లవరం గ్రామానికి చెందిన తెలుగుతమ్ముళ్లు మరింత దూకుడు ప్రదర్శిస్తున్నారు. నంద్యాలంపేట రెవెన్యూ గ్రామ పరిఽధిలో సర్వేనంబర్ 859లో 16 ఎకరాలు, సర్వే నంబర్ 840లో 70 ఎకరాల భూమికి కంచె వేశారు. తాజాగా సర్వే నంబర్ 854/1లో 1.61 ఎకరాలు అస్సెస్పీ వేస్ట్ ల్యాండ్ (ఏడబ్ల్యూ) చదును చేశారు. దాని సమీపంలోని సర్వే నంబర్ 840లో ఉన్న మరింత భూమిని కలుపుకొని సుమారు నాలుగెకరాలు, ప్రభుత్వం స్వాధీన అనుభవంలో భూమిని తాజాగా డోజర్లతో చదును చేసి తెలుగుతమ్ముళ్లు వశపర్చుకుంటున్నారు. నేషనల్ హైవే రహదారి పక్కలో ఉన్న ఆ పొలం ఎకరం రూ.50 లక్షలకు తక్కువ లేకుండా పలుకుతోంది. అలాంటి భూమి అన్యాక్రాంతమవుతున్నా, రెవిన్యూ యంత్రాంగం పట్టించుకోవడం లేదు. కనీసం అటువైపు కన్నెత్తి చూడడం లేదు.
పట్టా రద్దు భూమి సైతం..
2022లో డీకేటీ పట్టా రద్దు చేసిన భూమిని 2024లో ప్రభుత్వ ఏడబ్ల్యూ ల్యాండ్‌గా గుర్తించారు. 2025లో అదే భూమి తెలుగుతమ్ముళ్లు వశమైంది. ఎకరం రూ.50లక్షలు చేసే ప్రభుత్వ భూమి ఆన్యాక్రాంతమైంది. సర్వే నంబర్ 854/1లో 1.61 ఎకరాలు బొడికే లక్ష్మిదేవి పేరిట డీకేటీ పట్టా నెం.294/1414, జనవరి 20, 2005న జారీ అయ్యింది. పట్టాదారు పాసుపుస్తకం కూడా మంజూరైంది. ఆ భూమిలో తాము పంట పెట్టలేని ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నామని డీకేటీ పట్టా రద్దు చేయాల్సిందిగా అప్పటి తహసీల్దార్ ప్రేమంత్‌కుమార్‌కు బొడికే లక్ష్మిదేవి ఆర్జీ పెట్టుకున్నారు. ఆ మేరకు 2022 జనవరి 25న డీకేటీ పట్టా రద్దు చేస్తూ తహశీల్దారు ఉత్తర్వులు జారీ చేశారు. అదే భూమిని 2024 జనవరి 11న ఏడబ్ల్యూ ల్యాండ్‌గా గుర్తిస్తూ అప్పటీ తహసీల్దార్ అనురాధ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ భూమిగా సూచిక బోర్టు కూడా ఏర్పాటు చేశారు. కూటమి సర్కార్ వచ్చిన తర్వాత అదే భూమి తెలుగుతమ్ముళ్లు వశమైంది. తాజాగా జాండ్లవరం గ్రామానికి చెందిన టీడీపీ నేత ఒకరు స్వాధీనం చేసుకొని చదును చేస్తున్నారు.
నంద్యాలంపేట రెవెన్యూ పొలంలో భూములు యథేచ్ఛగా కబ్జాకు గురవుతున్నాయి. జగనన్న కాలనీ కోసం సర్వే నంబర్ 859లో 16 ఎకరాలు నిర్ణయించారు. ఎకరం రూ.20 లక్షలు విలువ చేసే ఈ స్థలాన్ని పేదలకు ఇండ్ల స్థలాల కోసం అప్పటి ప్రభుత్వం నిర్ణయించింది. వ్యక్తిగత కేటాయింపులు కూడా చేశారు. ఈ తరుణంలో కొంతమంది కోర్టును ఆశ్రయించి, ఆభూమిలో పట్టాలు ఇవ్వకుండా అడ్డుకున్నారు. ప్రస్తుతం వ్యవహారం కోర్టులో ఉండగా జాండ్లవరం గ్రామానికి చెందిన తెలుగుతమ్ముళ్లు ఆ భూమిని చదును చేసి స్వాధీనం చేసుకున్నారు. అలాగే సర్వే నంబర్ 840లో 70 ఎకరాలు బ్రహ్మంసాగర్ నిర్వాసితుల కోసం కేటాయించారు. ఆ భూమికి ఏకంగా ఫెన్సింగ్ వేశారు. ప్రభుత్వ భూమిలో ఫెన్సింగ్ వేస్తున్నారని గ్రామస్థాయి రెవెన్యూ సిబ్బంది ప్రశ్నిస్తే వారిపై నోటి దురుసుతనం ప్రదర్శించినట్లు తెలుస్తోంది. జిల్లా స్థాయి రెవెన్యూ యంత్రాంగానికి ఫిర్యాదులున్నా, నోరుమెదపలేదు. కోట్లాది రూపాయాలు విలువ చేసే ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అవుతున్నా కనీస స్పందన లేదు. చట్టం తెలుగుతమ్ముళ్లు చుట్టం కావడమే అందుకు ప్రధాన కారణంగా పరిశీలకులు వెల్లడిస్తున్నారు.