
ఏఎఫ్‌యూలో రేపు కౌన్సెలింగ్
కడప ఎడ్యుకేషన్: డాక్టర్ వైఎస్‌ఆర్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ విశ్వవిద్యాలయంలో 25న బీఎఫ్‌ఏ (ఫోర్ ఇయర్స్ డిగ్రీ) ఫైన్ ఆర్ట్స్ (యానిమేషన్, అప్లైడ్ ఆర్ట్, పెయింటింగ్, ఫొటోగ్రఫీ, శిల్పం, బి. డెస్ ఇంటీరియర్ డిజైన్) కోర్సులకు కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు వీసీ విశ్వనాథ్‌కుమార్ తెలిపారు. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్స్‌తో హాజరు కావాలని తెలిపారు. మరింత సమాచారం కోసం www.ysrafu.ac.in వెబ్‌సైట్‌ను సందర్శించాలని తెలిపారు.
కడప ఎడ్యుకేషన్: యోగి వేమన విశ్వవిద్యాలయం అనుబంధ డిగ్రీ కళాశాలల ఇన్‌స్టంట్ పరీక్షల ఫలితాలను శనివారం వైవీయూ ఉపకులపతి ఆచార్య అల్లం శ్రీనివాసరావు విడుదల చేశారు. ఈ సందర్భంగా రిజిస్ట్రార్ ఆచార్య పి.పద్మ, పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య కేఎస్వీ కృష్ణారావుతో కలసి మాట్లాడారు. బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ, బ్యాచిలర్ ఆఫ్ ఒకేషనల్ ఐదు సెమిస్టర్ల పరీక్షలకు1,012 మంది విద్యార్థులు హాజరు కాగా 977 మంది ఉత్తీర్ణత సాధించారని వెల్లడించారు. పీజీ కోర్సులలో ప్రవేశాలకు అనువుగా ఫలితాలు విడుదల చేశామని తెలిపారు. విద్యార్థులు ఫలితాల కోసం https:www.yvuexams.in/ resu lts.aspx అనే వైబ్సెట్‌ను సందర్శించాలని ఆచార్య కృష్ణారావు సూచించారు. ఈ కార్య క్రమంలో సహాయ పరీక్షల నియంత్రణ అధి కారి డాక్టర్ గణేష్ నాయక్ పాల్గొన్నారు.
కడప అగ్రికల్చర్: జిల్లాలో ఎరువులు, యూరియా అధిక ధరలు అరికట్టడంతోపాటు ఎరువుల బ్లాక్ మార్కెట్‌కు అడ్డుకోవడానికి వ్యవసాయశాఖ అధికారులు వ్యవసాయశాఖ అధికారితోపాటు పోలీసు, విజిలెన్స్ డిపార్టమెంట్‌కు చెందిన అధికారులతో కలిసి టీమ్‌లను ఎంపిక చేసింది. ఈ టీమ్‌లలో వ్యవ సాయ డివిజన్ వారిగా ఆయా డివిజన్ ఏడీలతోపాటు పోలీసు సర్కిల్ ఇన్‌స్పెక్టరు, విజిలెన్స్ డిపార్టుమెంట్‌కు సంబంధించి ఒక అధికారితో కలిసి టీమ్‌లను ఏర్పాటు చేశారు. జిల్లాలో ఎనిమిది వ్యవసాయ డివిజన్లకు 8 టీమ్‌లను ఏర్పాటు చేశారు. ఈ టీమ్స్ కలిపి జిల్లావ్యాప్తంగా ఆయా ఆయా వ్యవసాయ డివిజన్ల పరిధిలో ఎరువులను అధిక ధరలకు అమ్మినా, ఎరువులను బ్లాక్ మార్కెట్‌కు తరలించినా చర్యలు తీసుకోనున్నారు.
ఎరువులను బ్లాక్ మార్కెటింగ్ చేస్తే ...
కడప అర్బన్: ‘యూరియా ఎరువును దాచిపెట్టడం (హోర్డింగ్) , బ్లాక్ మార్కెటింగ్’ను నివారించేందుకు ప్రత్యేక దాడులు చేయనున్నట్లు విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ కడప రీజినల్ అధికారి ఏ. శ్రీనివాసరావు శనివారం ఒక ప్రకటనలో తెలియజేశారు. యూరియాను దారి మళ్లించడం, అక్రమంగా నిల్వ చేయడం లేదా బ్లాక్ మార్కెటింగ్ చేయడం చట్టవిరుద్ధమని పేర్కొన్నారు. బ్లాక్ మార్కెట్ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.