
దివ్యాంగుల పింఛన్ల తొలగింపు అమానుషం
పులివెందుల: రాష్ట్రంలోని దివ్యాంగుల పింఛన్లను కూటమి ప్రభుత్వం తొలగించడం అమానుషమని కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి పేర్కొన్నారు. శనివారం పులివెందులలోని భాకరాపురంలో ఉన్న వైఎస్ జగన్ క్యాంపు కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం దాదాపుగా 4లక్షల పింఛన్లను తొలగించిందన్నారు. అదేమని ప్రశ్నిస్తే కుంటి సాకులు చెబుతోందన్నారు. చంద్రబాబు నాయుడు దివ్యాంగులతో కూడా రాజకీయాలు చేయడం నీచమైన చర్యగా అభివర్ణించారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో 66 లక్షలకుపైగా పింఛన్లు అందజేసేదని, అయితే ప్రస్తుత ప్రభుత్వం 62లక్షల పింఛన్లు పంపిణీ చేస్తోందన్నారు. అలాగే ఈ ప్రభుత్వంలో రైతన్నలకు ఎరువులు కూడా లభించడంలేదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రమైన యూరియా కొరత ఏర్పడిందన్నారు. ప్రభుత్వం సరఫరా చేస్తున్న యూరియాను అధికార పార్టీ నాయకులు పక్కదారికి మళ్లిస్తున్నారన్నారు. సూపర్ సిక్స్ పథకాలు అమలు చేశామంటూ ప్రభుత్వం గొప్పలు చెప్పుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. అరకొరగా సంక్షేమ పథకాలు అందజేసి అన్ని పథకాలు అమలు చేస్తున్నామని తెలుగుదేశం పార్టీ నాయకులు, ఎల్లో మీడియా ప్రచారం చేసుకుంటున్నారన్నారు. అనంతరం ఆయన ప్రజా దర్బార్ నిర్వహించారు.
వైఎస్సార్‌సీపీ నాయకులకు పరామర్శ
గత జెడ్పీటీసీ ఎన్నికల సందర్భంగా ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, వైఎస్సార్‌సీపీ నాయకుడు వేల్పుల రాములపై టీడీపీ గూండాలు అమానుషంగా దాడి చేసిన విషయం విదితమే. దాడి చేసిన వారిని అరెస్టు చేయకుండా తిరిగి వైఎస్సార్‌సీపీ నాయకులపై పోలీసులు ఎస్సీ, ఎస్టీ కేసు, అటెంప్డ్ మర్డర్ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో పులివెందుల సబ్‌జైలులో రిమాండ్‌లో ఉన్న వైఎస్సార్‌సీపీ నాయకులైన మనోహర్, గుండాలయ్య, చంద్రబాబు, మునిచంద్ర, ఎస్.గంగిరెడ్డి, అంకాల్‌రెడ్డి, గోపాల్, క్రిష్టిపాటి గంగిరెడ్డిలను శనివారం ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి ములాఖత్ ద్వారా సబ్‌జైలులో కలిశారు. ఈ సందర్భంగా వారిని ధైర్యంగా ఉండాలని, పార్టీ తరపున అండగా ఉంటామని భరోసా ఇచ్చినట్లు తెలిసింది.
ప్రజల సమస్యలపై అధికారులకు ఫోన్ చేస్తున్న ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి
ములాఖత్ అనంతరం సబ్‌జైలు నుంచి బయటకు వస్తున్న ఎంపీ
కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి

దివ్యాంగుల పింఛన్ల తొలగింపు అమానుషం