
చేయి తడిపితేనే.. ఫైల్ ముందుకు
● అవినీతికి కేరాఫ్ మైలవరం
తహసీల్దార్ కార్యాలయం
● ప్రతి పనికీ ఒక రేటు
● చేయి తడపకుంటే నెలల తరబడి సాగదీత
● అధికారులపై సిబ్బంది, సిబ్బందిపై
అధికారుల సాకులు
మైలవరం : మైలవరం మండల తహసీల్దార్ కార్యాలయంలో అవినీతి మడుగులో కూరుకుపోయింది. ఇక్కడ సామాన్య రైతులకే కాదు.. అధికార పార్టీనేతలకు కూడా సైతం పనులు కావడంలేదు. అది అక్రమమైనా.. సక్రమమైనా చేయి తడిపితేనే ఫైల్ ముందుకు కదులుతుంది. లేదంటే ఎన్ని ఆధారాలు చూపిన నెలలు తరబడి దానిని సాగదీస్తునే ఉంటారు.
సచివాలయాలు వదిలి మండల కేంద్రంలోనే తిష్ట
జగన్ ప్రభుత్వ హాయంలో ఆయా గ్రామాల సచివాలయాల్లో క్రమం తప్పకుండా కనిపించే వీఆర్వోలు ఇప్పుడు మండల తహసీల్దార్ కార్యాలయం వదిలి వెళ్లడంలేదు. వీరికి మండల తహసీల్దార్ కార్యాలయం సైతం ఆసనాలు సైతం ఏర్పాటు చేశారు. వాస్తవానికి గ్రామస్థాయి అధికారులు ఆయా గ్రామాల ప్రజలకు అందుబాటులో ఉండాలనే ఉద్దేశ్యంతో జగన్ ప్రభుత్వం గ్రామ సచివాలయాలను నెలకొల్పింది. వీఆర్వోలకు సైతం అందులో ఒక టేబుల్ , కుర్చి ఏర్పాటు చేసి ప్రతి రోజు అక్కడే హాజరు వేయాలని నిబంధనలు పెట్టింది. దీంతో జగన్ ప్రభుత్వ హాయంలో ప్రతి రోజు వీఆర్వోలు గ్రామ సచివాయాలకు వెళ్లుతూ సాయంత్రం ఐదు గంటల వరకు ప్రజలకు అందుబాటులో ఉండేవారు. ఏమంటూ కూటమి ప్రభుత్వం అధికారంలోనికి వచ్చిందో గ్రామ సచివాయాలు పూర్తిగా నిర్వీర్యం అయ్యాయి. ముఖ్యంగా మైలవరం మండలానికి చెందిన ఒక్క వీఆర్వో కూడా రోజు సచివాయానికి వెళ్లడంలేదు. వీరంతా మండల కేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయంలో తిష్టవేసి కార్యాలయాన్ని అక్కడినుంచే కార్యాకలాపాలను నడిపిస్తున్నారు. పల్లె ప్రజలకు ఏ చిన్న అవసరం వచ్చిన తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లవలసిందే. అక్కడ ప్రతి పనికి ఒక రేటు నిర్ణయిస్తున్నారు. అడిగినంత ముట్టజేబితే ఏ ఆధారాలు లేకపోయిన నిమిషాల్లో పూర్తి చేసి పంపిస్తున్నారు. చేయి తడకపోతే అది ఎంత సక్రమమైన ఫైల్ అయినా వారు కోరిన ఆధారాలు అన్నింటిన్ని సమర్పించినప్పటికీ నెలలతరబడి సాగదీస్తూనే ఉంటారు తప్ప పనిమాత్రం ససేమిరా చేయ్యరు. పై పెచ్చు అధికారులు మీద సిబ్బంది సిబ్బంది మీద అధికారులు ఒకరిపై ఒకరు సాకులు చెబుతూ పొద్దుపొచ్చుతున్నారు.
ఉన్నతాధికారులు దృష్టిసారించలేరనే ధీమా
ఇక్కడ పనిచేస్తున్న అధికారులు, సిబ్బంది సాక్ష్యాత్తు తహసిల్దార్‌ను సైతం తప్పుదోవ పట్టించిన సంఘటనలు చాలా ఉన్నాయి. అయినప్పటికి తహసీల్దార్ కూడా తప్పు చేసిన సిబ్బందిని మందలించలేకపోతున్నారన్న విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. దీంతో ఇక్కడ సిబ్బంది ఆడింది ఆట పాడింది పాటగా చెలామణి అవుతుంది. ఇటివల చనిపోయిన వ్యక్తి పేరుతో ఓ వ్యక్తి ఫిర్యాదు ఇస్తే దానిని స్వీకరించిన అధికారులు సాక్షాత్తు తహసీల్దార్ సంతకంతోనే బాధిత రైతులకు నోటీసులు జారీ చేశారు. విచారణకు హాజరైన బాధితులు చనిపోయిన వ్యక్తి ఎలా ఫిర్యాదు చేస్తాడని ప్రశ్నించిన అక్కడ సిబ్బంది ఏమాత్రం తొణకకుండా మరో సారి విచారణకు రావాలంటూ హుకుం జారీ చేశారు. ఈ సంఘటనపై సాక్షి దినపత్రికలో ప్రముఖంగా వార్త ప్రచురితం కావడంతో ఉలికి పడ్డ అధికారులు ఆ ఫైల్‌ను మూసివేశారే తప్ప తమ తీరును మార్చుకోలేదు. అందుకు కారణం ఉన్నతాధికారులు ఈ కార్యాలయం వైపు కన్నెత్తి చూడటంలేదని భావన కలుగుతోంది.