
విద్యార్థి ఆత్మహత్యపై పూర్తి దర్యాప్తు చేయాలి
వేంపల్లె : ఇడుపులపాయ ఆర్కే వ్యాలీ ట్రిపుల్ ఐటీలో గురువారం తెల్లవారుజామున హాస్టల్‌లోని బాత్రూంలో కిటికీకి ఉరి వేసుకుని జి.నరసింహనాయుడు అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న విషయం అందరికి తెలిసిందే. అయితే మృతుడి ఆత్మహత్యపై బంధువులు పలు అనమానాలు వ్యక్తం చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చర్ల మండలం షేర్ మహమ్మదాపురం గ్రామం నుంచి మృతుని చిన్నాన్న ఉమా మహేశ్వరరావు, బంధువులు శుక్రవారం ఇడుపులపాయ ఆర్కే వ్యాలీ ట్రిపుల్ ఐటీకి చేరుకున్నారు. సంఘటన స్థలాన్ని వారు పరిశీలించి పలు అనుమానాలు వ్యక్తం చేసి ఆర్కే వ్యాలీ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తండ్రి చనిపోయినా తల్లి రాజులమ్మ కష్టపడి చదివిస్తుండేది. తమ పిల్లవాడు బాగా చదివేవాడని, మంచి మార్కులు వచ్చేవని తెలిపారు. ఇంటర్మీడియట్ ఫస్టియర్ (పీయూసీ–1) లో కూడా 7.5 గ్రేడింగ్ పాయింట్లు వచ్చాయని, ఆత్మహత్య చేసుకునే అంత పిరికివాడు కాదని బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేంపల్లె ప్రభుత్వాసుపత్రి మార్చురీలో నరసింహనాయుడు మృతదేహాన్ని చిన్నాన్న, బంధువులు చూసి బోరున విలపించారు. విద్యార్థి ఆత్మహత్యపై పలు అనుమానాలు ఉన్నాయని.. పూర్తి దర్యాప్తు నిర్వహించాలని పులివెందుల డీఎస్పీ మురళి నాయక్, సీఐ ఉలసయ్యలను వారు కోరారు. ఆర్కే వ్యాలీ క్యాంపస్‌లో ఉన్న వారు ఆత్మహత్యకు ఎవరైనా సరే తప్పు చేసి ఉంటే వారి పైన కఠినంగా శిక్షించాలని కోరారు. వేంపల్లె ప్రభుత్వాసుపత్రిలో ఉన్న నరసింహనాయుడు మృతదేహాన్ని పోస్టుమార్టం నిర్వహించి తమ స్వగృహానికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో డైరెక్టర్ స్పందించి ఆర్కే వ్యాలీ ట్రిపుల్ ఐటీలో విద్యార్థికి ఎటువంటి ఇబ్బందులు లేవని తెలిపారు. గత కొన్ని నెలలుగా విద్యార్థి మూడీగా ఉంటున్నట్లు సహచార విద్యార్థులు తమ దృష్టికి తీసుకొచ్చారాన్నారు. అంతేకాకుండా తనకు ట్రిపుల్ ఐటీలో చదవడం ఇష్టంలేదని, నర్సింగ్ చదవాలని స్నేహితులతో చెప్పేవాడన్నారు. విద్యార్థి మొబైల్‌లో ఉన్న నోట్ బుక్‌లో ‘ఐ వాంట్ టు డై’ సారీ మమ్మీ అని కూడా వ్రాశారని పోలీసుల దర్యాప్తులో తేలిందని చెప్పుకొచ్చారు. అయితే కళాశాల యాజమాన్యం, అటు పోలీసులు పూర్తి విచారణ చేయించి మృతుని కుటుంబానికి ఏమి న్యాయం చేస్తారో వేచి చూడాలి.
అనుమానాలు వ్యక్తం చేస్తున్న
మృతుడి బంధువులు