
తాళం వేసిన ఇళ్లే టార్గెట్
రాజుపాళెం : వివిధ చోరీలు, ఇంటి యజమానిపై దాడి చేసిన సంఘటనల్లో నిందితుడు తిమ్మారెడ్డి మహమ్మద్ రఫీని బుధవారం మధ్యాహ్నం అరెస్ట్ చేసినట్లు ప్రొద్దుటూరు రూరల్ సీఐ బాల మద్దిలేటి తెలిపారు. ప్రొద్దుటూరు రూరల్ పోలీస్ స్టేషన్‌లో బుధవారం సాయంత్రం రూరల్ సీఐ, రాజుపాళెం ఎస్‌ఐ వెంకటరమణతో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. నిందితుడు మహమ్మద్ రఫీ గతంలో కర్నూలు, వెలుగోడు, గోనెగండ్లు, ఓర్వకల్లు, ఉలింది కొండ, చాగలమర్రి, ఆళ్లగడ్డ తదితర పోలీస్ స్టేషన్‌లో పలు చోరీ కేసులలో నిందితుడుగా ఉన్నాడన్నారు. పట్ట పగలు తాళాలు వేసిన ఇళ్లను టార్గెట్ చేస్తూ దొంగతనాలకు పాల్పడేవాడన్నారు.
పట్టపగలే చోరీ..
ఈ నెల 7వ తేదీన రాజుపాళెం మండలంలోని టంగుటూరు గ్రామంలో నంద్యాల వెంకటసుబ్బయ్య ఇంటికి తాళం వేసి ఉండడాన్ని చూసి సదరు నిందితుడు మహమ్మద్ రఫీ ఇంటి తాళం, బీరువాను పగల గొట్టేందుకు ప్రయత్నించాడని తెలిపారు. అంతలో ఇంటి యజమాని నంద్యాల వెంకటసుబ్బయ్య ఇంటిలోనికి రాగా బీరువాను పగులగొడుతున్న నిందితుడిని ఎవరు నువ్వు అని ప్రశ్నించగా దొంగతనానికి వచ్చానని చెప్పి ఇంటి యజమానిపై దాడి చేశాడన్నారు. చోరీకి ఉపయోగించిన ఇనుప రాడ్డు తీసుకొని వెంకటసుబ్బయ్య తలపై కొట్టడంతో రక్త గాయాలయ్యాయన్నారు. ఆ సమయంలో యజమాని కేకలు వేయడంతో చుట్టుపక్కల వారంతా ఇంట్లోకి రావడంతో చోరీ చేస్తున్న రఫీ పారిపోయాడని సీఐ తెలిపారు. నంద్యాల వెంకటసుబ్బయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు రాజుపాళెం పోలీస్ స్టేషన్‌లో నిందితుడిపై చోరీతో పాటు హత్యాయత్నం కేసు నమోదు చేశామన్నారు. నిందితుడిని గోపాయపల్లె చెక్‌పోస్ట్ వద్ద అరెస్టు చేసినట్లు ఆయన తెలిపారు. టంగుటూరు, రాజుపాళెం గ్రామాల్లో చోరీ చేసిన బంగారు ఆభరణాలను నిందితుడి వద్ద నుంచి రికవరీ చేసినట్లు చెప్పారు. నిందితుడు మహమ్మద్ రఫీ దువ్వూరు మండలంలోని జిల్లెల్ల గ్రామానికి చెందిన వాడు. నిందితుడిని కోర్టుకు హాజరు పరుస్తున్నట్లు సీఐ వివరించారు.
ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి
ప్రజలు చోరీలపై అప్రమత్తంగా ఉండాలని, ఇంట్లో విలువైన వస్తువులు, నగదును భద్రపరుచు కోవడంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. గ్రామాల్లో ఎవరైనా అపరిచిత, అనుమానాస్పద వ్యక్తులు కనిపించినట్లయితే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సీఐ కోరారు. సమావేశంలో హెడ్ కానిస్టేబుల్ చంద్రా నాయక్, పోలీసులు సుధాకర్, కిరణ్ పాల్గొన్నారు.
పట్టపగలే చోరీ, దాడి కేసులో
నిందితుడి అరెస్టు
వివరాలను వెల్లడించిన ప్రొద్దుటూరు రూరల్ సీఐ

తాళం వేసిన ఇళ్లే టార్గెట్