
‘గండికోట’లోకి భారీగా కృష్ణా జలాల రాక
కొండాపురం : అవుకు రిజర్వాయర్ నుంచి గాలేరు–నగరి సృజల స్రవంతి కెనాల్ ద్వారా 11,200 క్యూసెక్కుల కృష్ణజలాలు గండికోట జలాశయంలోకి వస్తున్నట్లు జీఎన్‌ఎస్‌ఎస్ ఈఈ ఉమా మహేశ్వర్లు బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గండికోట జలాశయం పూర్తి సామర్థ్యం 26.85 టీఎంసీలు ఉండగా ప్రస్తుతం 20.1 టీఎంసీలకు చేరినట్లు ఆయన తెలిపారు. వాగులు వంకల ద్వారా 2700 క్యూసెక్కులనీరు జలాశయంలోకి వస్తున్నట్లు ఆయన తెలిపారు. పుల్ రిజర్వాయర్ లెవల్ 695.5 అడుగులు ఉండగా ప్రస్తుతం 690 అడుగులకు రిజర్వాయర్ లెవల్‌కు చేరినట్లు తెలిపారు. గండికోట స్పిల్ వే క్రిస్ట్ గేట్ల ద్వారా మైలవరం జలాశయానికి 7500 క్యూసెక్కుల నీరు వెళ్తున్నాయన్నారు. గండికోటఎత్తిపోతల పథకం ద్వారా నాలుగు మోటర్లతో 440 క్యూసెక్కులనీరు పంపింగ్ చేస్తున్నామని వెల్లడించారు. జీఎన్‌ఎస్‌ఎస్ మెయిన్ కెనాల్ ద్వారా 300 క్యూసెక్కుల నీరు తరలిస్తున్నామన్నారు.