ఉచిత బస్సు కొందరికే! | - | Sakshi
Sakshi News home page

ఉచిత బస్సు కొందరికే!

Aug 14 2025 7:13 AM | Updated on Aug 14 2025 7:13 AM

ఉచిత

ఉచిత బస్సు కొందరికే!

కడపకోటిరెడ్డిసర్కిల్‌ : ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల్లో భాగంగా మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని ఈనెల 15 నుంచి అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు తగిన ఏర్పాట్లు చేస్తోంది. కూటమి ప్రభుత్వం ఆర్భాటంగా ప్రారంభించనున్న పల్లె వెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్‌లలో ఉచిత ప్రయాణం కొందరికే ఉపయోగపడనుంది. ఒకవైపు ఎక్స్‌ప్రెస్‌లలో ఉచితం అంటూనే నాన్‌ స్టాప్‌లుగా నడిచే ఎక్స్‌ప్రెస్‌లలో నో ఫ్రీ అంటూ కొర్రీలు పెట్టింది. ప్రస్తుతానికి నిబంధనలు ఇవే ఉన్నప్పటికీ ప్రారంభించే సమయానికి ఇంకా ఎన్ని నిబంధనలు ఉంటాయోనని ఆర్టీసీ అధికారులు, ఉద్యోగులు చర్చించుకుంటున్నారు. అయితే ఇంతవరకు ఆర్టీసీ అధికారులకు మార్గదర్శకాలు రాకపోవడం విశేషం.

జిల్లాలో కడప, బద్వేలు, మైదుకూరు, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, పులివెందుల డిపోలు ఉన్నాయి. ఆయా డిపోల్లో ఎక్స్‌ప్రెస్‌లు 113, పల్లె వెలుగు 189, అల్ట్రా పల్లె వెలుగు 58 బస్సులు ఉన్నాయి. ఇంతవరకు కొత్త బస్సు ఒక్కటి కూడా రాకపోవడం దారుణం. మరోవైపు ఎక్స్‌ప్రెస్‌ సర్వీసులైన నాన్‌స్టాప్‌ బస్సుల్లో అనుమతులు లేకపోవడం వల్ల పెద్దగా ఒరిగేదేమీ లేదని చర్చించుకుంటున్నారు. పట్టణాల నుంచి పల్లెలకు నడిచేవి పల్లె వెలుగు బస్సులు మాత్రమే. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఈ ఉచిత ప్రయాణం అందరికీ ఉపయోగపడే పరిస్థితి లేదని అంటున్నారు.

డొక్కు బస్సుల్లోనే ప్రయాణం

ప్రతిరోజు జిల్లాలో వివిధ బస్సుల్లో 1.50 లక్షల నుంచి 1.70 లక్షల వరకు ప్రయాణికులు వివిధ ప్రాంతాల నుంచి రాకపోకలు సాగిస్తుంటారు. అయితే వాటిలో మహిళలు 60–70 వేల మంది వరకు ప్రయాణిస్తుంటారు. జిల్లాలో 360 బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణానికి అవకాశం కల్పించారు. కండీషన్‌లో లేని బస్సులు కడప రీజియన్‌లో అధికంగా ఉండడం గమనార్హం. ఉచిత బస్సు ప్రయాణం అమలు చేసిన తర్వాత ఎక్కువ మంది మహిళా ప్రయాణికుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. అయితే బస్సుల్లో లోడు పెరగడం ద్వారా బస్సుల పరిస్థితి అంతంత మాత్రంగా ఉండడంతో ప్రయాణం సజావుగా సాగుతుందా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. మూలన పడేందుకు సిద్ధంగా ఉన్న బస్సులకు రంగులు అద్ది రోడ్లపైకి తీసుకు వచ్చేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.

ఉద్యోగులు, విద్యార్థులకు తప్పని తిప్పలు

ప్రతిరోజు ఉదయాన్నే విద్యార్థులు పాఠశాలలు, కళాశాలలకు వెళ్లేందుకు, మరోవైపు ఉద్యోగులు తమ కార్యాలయాలకు వెళ్లేందుకు ఆర్టీసీ బస్సులను ఆశ్రయిస్తున్నారు. అయితే మహిళలకు ఉచిత ప్రయాణం నేపథ్యంలో ఒక్కసారిగా మహిళలు అధికంగా బస్సులో ఎక్కితే ఉదయం, సాయంత్రం సమయాల్లో విద్యార్థులు, ఉద్యోగులకు సీట్లు దొరికే పరిస్థితి ఉండదు. దీంతో అఽధికారులు ఈ సమస్యను అధిగమించేందుకు ఎలాంటి చర్యలు చేపడతారో వేచి చూడాల్సిందే.

ఇచ్చిన హామీ విస్మరించారు

గత సార్వత్రిక ఎన్నికల్లో ఎలాగైనా గద్దె ఎక్కాలన్న తలంపుతో రాష్ట్రమంతటా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని కూటమి నేతలు హామీలు ఇచ్చారు. తీరా అధికారంలోకి వచ్చాక ఆ హామీని మడత పెట్టారు. పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో మాత్రమే ఉచిత ప్రయాణానికి అనుమతిస్తూ నిర్ణయం తీసుకున్నారు. కేవలం ఈ బస్సుల్లో మాత్రమే ఉచిత ప్రయాణమని ఎన్నికల సమయంలో కూటమి నేతలు ఎక్కడా కూడా చెప్పలేదు. అధికారం చేపట్టిన ఏడాది తర్వాత ఈ పథకాన్ని అమలు చేస్తూ చంద్రబాబు తన కుతంత్రాన్ని బహిర్గతం చేశారని మహిళలు మండిపడుతున్నారు.

నాన్‌ స్టాపుల్లో నో ఎంట్రీ

జిల్లాలో కడప–తిరుపతి, కడప–ప్రొద్దుటూరు, ప్రొద్దుటూరు–జమ్మలమడుగు ప్రాంతాలకు నాన్‌స్టాప్‌ బస్సులను నడుపుతున్నారు. అయితే ఆర్టీసీలో ఎక్కువగా ఎక్స్‌ప్రెస్‌ బస్సులనే నాన్‌స్టాప్‌ సర్వీసులుగా నడుపుతున్నారు. వీటిల్లో ఉచిత ప్రయాణానికి అనుమతించరు

టిక్కెట్‌ జారీ ఇలా..

సీ్త్ర శక్తి పథకంలో భాగంగా ఉచిత ప్రయాణానికి టిక్కెట్‌జారీ విధానాన్ని ప్రభుత్వం ప్రకటించింది. బస్సు ఎక్కేచోటు నుంచి దిగే ప్రాంతం వరకు టిక్కెట్‌ ఇస్తారు. టిక్కెట్‌ విలువను సున్నాగా నమోదు చేస్తారు. టిక్కెట్‌ జారీ చేసే టిమ్‌ మిషన్‌లో ప్రత్యేకంగా ఉమెన్‌ ఫ్రీ టిక్కెట్‌ పేరిట బటన్‌ ఏర్పాటు చేశారు. బాలికలు, సీ్త్రలు, ట్రాన్స్‌జెండర్స్‌కు జీరో ఫెయిర్‌ టిక్కెట్‌ ఇస్తారు.

గుర్తింపు కార్డు తప్పనిసరి

ఉచిత ప్రయాణానికి కండక్టర్‌కు గుర్తింపుకార్డు తప్పనిసరిగా చూపాలి. ఆధార్‌, ఓటరు ఐడీ, రేషన్‌కార్డు, పాస్‌పోర్టులలో ఏదో ఒకటి చూపడం తప్పనిసరి. ఆయా గుర్తింపు కార్డులో మన రాష్ట్రంలోని ఏదో ఒక ప్రాంతంలో నివసిస్తున్నట్లుగా ఉండాల్సి ఉంటుంది.

ఉద్యోగులు, విద్యార్థులకు తిప్పలు

పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు,

ఎక్స్‌ప్రెస్‌లలో మాత్రమే అవకాశం

నాన్‌స్టాప్‌లో ఉచిత ప్రయాణానికి నో

మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం అందని ద్రాక్ష

బస్సులను కండీషన్‌లో ఉంచాం

రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 15 నుంచి అమలు చేయనున్న మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. అన్ని బస్సులను కండీషన్‌లో ఉండేలా చూస్తున్నాం. ఇదే సమయంలో సాధారణ ప్రయాణికులకు కూడా ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాం.

– పొలిమేర గోపాల్‌రెడ్డి, జిల్లా ప్రజా రవాణాధికారి, కడప

ఉచిత బస్సు కొందరికే!1
1/1

ఉచిత బస్సు కొందరికే!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement