కడప ఎడ్యుకేషన్ : మారుతున్న పరిిస్థితులకు అనుగుణంగా విద్యా సంబంధిత విషయాలపై ప్రధానోపాధ్యాయులతోపాటు మండల విద్యాశాఖ అధికారులు సంపూర్ణ అవగాహన పొందాలని డీఈఓ షేక్ షంషుద్దీన్ పేర్కొన్నారు. బుధవారం కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ సమావేశ మందిరంలో హెచ్‌ఎం, ఎంఈఓలకు ఒక్క రోజు వర్కుషాపు జరిగింది. ఈ సందర్భంగా డీఈఓ షేక్ షంషుద్దీన్ మాట్లాడుతూ ప్రభు త్వం అమలు చేస్తున్న పథకాలను క్షేత్రస్థాయిలో పక్కాగా అమలు జరగాలన్నారు. వీటితోపాటు విద్యా సంబంధిత విషయాలపై సంపూర్ణ అవగాహన పెంచుకోవాలన్నారు. జిల్లాస్థాయిలో జరుగుతున్న వర్కుషాపులో హెచ్‌ఎంలతోపాటు ఎంఈఓలు విద్యాభివృద్ధ్దికి సంబంధించిన విషయాలపై చర్చించాలన్నారు. సమగ్రశిక్ష ఏసీపీ నిత్యానందరాజు మాట్లాడుతూ హెచ్‌ఎంలతోపాటు ఎంఈఓలు విద్యాపరంగా విలువైన సలహాలు ఇస్తే రాష్ట్రస్థాయి అధికారులకు పంపిస్తామన్నారు. డిప్యూటీ ఈఓ రాజగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ విద్యాశాఖలో చాలా మార్పులు వచ్చాయని వాటికి అనుగుణంగా హెచ్‌ఎంలు, ఎంఈఓలు పనిచేయాలన్నారు. ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ రమాదేవి, సాంఘిక సంక్షేమశాఖ డిప్యూటి డైరెక్టర్ సరస్వతి, జిల్లా వైద్యశాఖ ప్రతినిధి వెంకట చంద్రరెడ్డి, సమగ్రశిక్ష ప్లానింగ్ కో ఆర్డినేటన్ లక్ష్మి నరసింహారాజు, ఏఎంఓ వీరేంద్ర, జిసిడిఓ రూతు ఆరోగ్యమేరీ, ఏఎస్‌ఓ సంజీవరెడ్డి, ఏపీఓ మాధవి, విజయభాస్కర్ పాల్గొన్నారు.
ఇన్‌స్పైర్ మనాక్ పోస్టర్ ఆవిష్కరణ
ఇన్‌స్పైర్‌మనాక్ నామినేషన్ల స్వీకరణలో రాష్ట్రంలో వై ఎస్సార్‌జిల్లాను మొదటిస్థానంలో నిలబెట్టాలని ప్రధానోపాధ్యాయులకు, ఎంఈఓలకు డీఈఓ షేక్ షంషుద్దీన్ పిలుపునిచ్చారు. బుధవారం కడప కలెక్టరేట్ సభాభవన్‌లో ఇన్‌స్పైర్ మనాక్ పోస్టర్‌ను డిప్యూటి ఈఓలు రాజగోపాల్‌రెడ్డి, మీనాక్షి, జిల్లా సైన్సు ఆఫీసర్ ఎబినైజర్‌లతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇన్‌స్పైర్ మనాక్‌కు ప్రతి పాఠశాల నుంచి 5 నామినేషన్లు చేయించేలా హెచ్‌ఎం, ఎంఈఓలు చొరవ తీసుకోవాలన్నారు. ఇన్‌స్పైర్ మనాక్‌కు సంబంధించిన ప్రాజెక్టులు ఇన్నోవేటివ్‌గా ఉండేలా చూడాలని సూచించారు. జిల్లా సైన్సు అధికారి ఎబినేజర్ మాట్లాడుతూ ప్రతి రోజు సాయంత్రం 5నుంచి శంకరాపురంలోని అంధుల పాఠశాలలో అందుబాటులో ఉంటానని... సందేహాలు ఉంటే తెలపాలని కోరారు. అప్లికేషన్ కోడ్‌ను 8328375357 నెంబర్‌కు వాట్సాప్ ద్వారా పంపితే స్కూల్ మెయిల్, పాస్‌వర్డు మార్చడం చేస్తామని తెలిపారు.