
జిల్లాలో జడివాన
కడప అగ్రికల్చర్ : జిల్లాలో వారం రోజుల నుంచి వర్షాలు జడిపట్టి కురుస్తున్నాయి. అల్పపీడనం కారణంగా మబ్బులు.. వాన చినుకులతోనే రోజులు గడుస్తున్నాయి. ఇక బుధవారం తెల్లవారుజాము నుంచి ఎడతెరిపి లేకుండా చినుకులు రాలుతూనే ఉన్నాయి. దీంతో పనులపై బయటకు వెళ్లే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అలాగే విద్యార్థులు, ఉద్యోగ విధులకు వేళ్లే వారు సైతం అవస్థలు పడ్డారు. వరుస వానలతో గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లన్నీ బురదమయంగా మారి జనాలు అవస్థలు ఎదుర్కొంటున్నారు.
ఖరీప్ సీజన్ ప్రారంభం నుంచి జిల్లాలో వర్షం కురవలేదు. దీంతో చాలా మేర పంటలసాగు కాలేదు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమై రెండున్నర నెల కావస్తున్నా నేటికి జిల్లాలో 20 శాతం మేరనే పంటలు సాగయ్యాయి. సాగైన పంటలకు సరైన వర్షా లు లేక రైతన్నలు కాసింత ఇబ్బందులకు గురయ్యా రు. అల్పపీడనం కారణంగా జిల్లాలో వారం రోజుల నుంచి వర్షాలు ప్రారంభమయ్యాయి. దీంతో సాగు లో ఉన్న ఆరుతడి పంటలైన జొన్న, సజ్జ, మొక్కజొ న్న, కొర్ర, కంది, పెసర, మినుము, వేరుశనగ, సన్‌ప్లవర్, సోయాబీన్, పత్తి పంటలకు జీవం వచ్చింది. వరిపంటలకు ఉన్న తెగులు తగ్గి ఏపుగా వస్తున్నట్లు పలువురు రైతులు తెలిపారు.
ప్రారంభంకానున్న ఆరుతడి పంటలసాగు...
గత వారం రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు భూమి పదునెక్కింది. ఇక రైతన్నలు కాడీ, మేడీ సిద్ధం చేసుకుని సాగుకు సన్నద్ధమవుతున్నారు. జిల్లాలో వేరుశనగతోపాటు పసుపు, జొన్న, కందితోపాటు ఇంకా పలు రకాల ఆరుతడి పంటలను సాగు చేయనున్నారు. దీంతోపాటు కేసీ కాలువకు నీరు కూడా రావడంతో వరిసాగు పనులు కూడా ఊపందుకున్నాయి.
ఉద్యాన పంటలకు మేలే...
జిల్లాలోని పులివెందుల, చక్రాయపేట, వేముల, వేంపల్లి, వీన్‌పల్లిలతోపాటు పలు మండలాల్లో సాగులో ఉన్న ఉద్యాన పంటలైన మామిడి, చీని, సపోట, జామ వంటి ఉద్యాన పంటలకు ఈ వర్షంతో ప్రాణం వచ్చింది.