
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
కడప అర్బన్ : కడప నగరం ఆటో నగర్ సమీపంలో మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో వెంకటేష్ (29) అనే వ్యక్తి మృతి చెందాడు. కడప ట్రాఫిక్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు సిద్దవటం మండలం ఎగువపేటకు చెందిన వెంకటేశ్ కడపలో ప్రైవేటు దుకాణంలో పనిచేస్తున్నాడు. మంగళవారం రాత్రి ద్విచక్ర వాహనంలో ఇంటికి వెళుతున్న సమయంలో వేగంగా వచ్చిన లారీ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. మృతుని బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
నాలుగు ఇసుక టిప్పర్లు పట్టివేత
చాపాడు : తిప్పిరెడ్డిపల్లె సమీపంలోని పెన్నానదిలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న నాలుగు టిప్పర్లను పట్టుకున్నట్లు ఏఎస్‌ఐ నరసింహులు తెలిపారు. ఎస్‌ఐ చిన్న పెద్దయ్య ఆదేశాల మేరకు పెన్నానదిలో దాడులు నిర్వహించగా నాలుగు టిప్పర్లు ఇసుకను తరలిస్తుండగా వాటిని పట్టుకుని పోలీసు స్టేషన్‌కు తరలించామన్నారు. కేసు నమోదు చేసి తహసీల్దారు రమాకుమారికి అప్పగించినట్లు చెప్పారు.
పెట్రోల్‌తో పాటు నీళ్లు
ద్విచక్ర వాహనదారుల ఆందోళన
వేంపల్లె : స్థానిక పులివెందుల రోడ్డులో ఉన్న హెచ్‌పీ పెట్రోలు బంకులో పెట్రోలుతోపాటు నీరు వస్తుండటంతో ద్విచక్ర వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. గత కొద్ది రోజులుగా వర్షాలు కురుస్తుండటంతో పులివెందుల రోడ్డులోని హెచ్‌పీ పెట్రోలు బంకులో వర్షపు నీరు వెళుతున్నట్లు తెలిసింది. బుధవారం వేంపల్లెకు చెందిన ఇబ్రహీం అనే వ్యక్తి ఈ పెట్రోలు బంకులో తన మోటార్ బైకుకు రూ.500లకు పెట్రోలు పట్టుకోవడంతో పెట్రోలుతోపాటు నీరు కూడా వచ్చింది. మోటార్ బైకు కొద్ది దూరం పోయిన తర్వాత ఆగిపోవడంతో మోటార్ బైకును బజాజ్ షోరూంకు తీసుకొని వెళ్లాడు. మెకానిక్ పరిశీలించి ట్యాంకరులో పెట్రోలుతోపాటు నీరు కూడా ఉందన్నారు. అయితే పెట్రోలు బంకు యాజమాని వద్దకు వెళ్లి విషయాన్ని తెలిపినా ఆయన సరైన సమాధానం ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారన్నారు. రెవెన్యూ అధికారులు స్పందించి పెట్రోలు బంకు యాజమాన్యంపై చర్యలు తీసుకుని వాహనదారులను కాపాడాలని కోరారు.

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి