
ఉద్యోగుల న్యాయమైన సమస్యలను పరిష్కరించాలి
కడప కోటిరెడ్డిసర్కిల్ : ఏపీఎస్ ఆర్టీసీలో పనిచేస్తున్న ఉద్యోగుల న్యాయమైన సమస్యలను సత్వరమే పరిష్కరించేలా ప్రభుత్వం, యాజమాన్యం తగిన చర్యలు చేపట్టాలని నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ నాయకులు డిమాండ్ చేశారు. ఆర్టీసీ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోరుతూ రెండవ రోజు బుధవారం అసోసియేషన్ నాయకులు కడప ఆర్టీసీ బస్టాండులోని ప్రధాన ద్వారం వద్ద ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉద్యోగులకు సంబంధించి తక్షణమే పీఆర్సీ కమిషన్‌ను ఏర్పాటు చేయాలని, వేతన సవరణ జరిగి ఇప్పటికే రెండు సంవత్సరాలు పూర్తయినందున వెంటనే ఐఆర్ ప్రకటించాలని, గవర్నర్‌పేట–2 డిపోకు చెందిన 4.15 ఎకరాల స్థలాన్ని లులూ సంస్థకు బదలాయిస్తూ ప్రభుత్వం ఇచ్చిన జీఓను ఉపసంహరించాలని డిమాండ్ చేశారు. 8 వేల ఖాళీలను డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా భర్తీ చేయాలని, గత నాలుగేళ్లుగా నిలిచిపోయిన పదోన్నతులు వెంటనే ఇవ్వాలని, నాన్ ఆపరేషన్ ఉద్యోగుల పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని, ఉద్యోగుల అనారోగ్య సెలవులకు పూర్తి జీతం చెల్లించాలని, ఈహెచ్‌ఎస్ స్థానంలో పాత వైద్య విధానాన్ని పునరుద్దరించాలని, గ్యారేజీ ఉద్యోగుల అపరిష్కృత సమస్యలను పరిష్కరించడంతోపాటు మహిళా ఉద్యోగులకు ప్రభుత్వ జీఓ ప్రకారం పిల్లల సంరక్షణ సెలవులు మంజూరు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ రీజినల్ ప్రెసిడెంట్ నాగముని, డిపో ప్రెసిడెంట్ జయరాం, గ్యారేజ్ సెక్రటరీ మల్లేష్, డిపో జాయింట్ సెక్రటరీ లక్ష్మయ్య, సీఎస్ రెడ్డి, రాఘవ తదితరులు పాల్గొన్నారు.
ధర్నాలో ఎన్‌ఎంయూఏ నాయకులు