
అవయవ దానం చేసి.. ప్రాణదాతగా నిలిచి..
మైలవరం : అవయవ దానం గురించి ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఏటా ఆగస్టు 13న ప్రపంచ అవయవ దాన దినోత్సవం నిర్వహిస్తారు. సరిగ్గా ఇదే రోజున వైద్యులు కల్పించిన అవగాహనతో మరణించిన ఓ వ్యక్తి కుటుంబ సభ్యులు అవయవ దానం చేసి స్ఫూర్తి ప్రదాతలుగా నిలిచారు. వివరాలు ఇలా..
ఈనెల 10వ తేదీన మైలవరం రిజర్వాయర్ గేట్ల వద్ద ప్రమాదవశాత్తు గోడ మీద పడిన దుర్ఘటనలో శివరామసుబ్బయ్య అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స నిమిత్తం అతన్ని కర్నూలులోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి బుధవారం మృతి చెందాడు. అవయవ దాన దినోత్సవం సందర్భంగా వైద్యులు ఇచ్చిన స్ఫూర్తితో మృతుని కుటుంబ సభ్యులు కిడ్నీ, లివర్, ఊపిరితిత్తులను ఆసుపత్రిలోనే దానం చేశారు. తాను మరణించినా మరొకరి జీవితానికి వెలుగును ప్రసాదించి చిరంజీవిగా నిలిచిపోయాడని అవయవ దానానికి అంగీకరించిన కుటుంబ సభ్యులను పలువురు అభినందించారు. మృతునికి భార్య, ఇద్దరు సంతానం ఉన్నారు.