
ఒక్క మాత్రతో ‘నులి’మేద్దాం
కడప ఎడ్యుకేషన్ : కంటికి కనిపించని శత్రువు. ఒంటికి హాని కలిగించేదే నులిపురుగు. ఇది మనిషి పేగుల్లో మకాం వేసి రక్తాన్ని పీల్చి పిల్లలను పిప్పి చేస్తూ రక్తహీనతను కలిగిస్తుంది. నులి పురుగులు అధిక శాతం అనారోగ్య సమస్యలకు కారణమవుతున్నాయి. దీని నివారణకు జిల్లా వ్యాప్తంగా ఈనెల 12వతేదీ మంగళవారం అన్ని అంగన్‌వాడీ, ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలలు, డిగ్రీ కళాశాలలు, పాలిటెక్నిక్, ఐటీఐలలో విద్యనభ్యసిస్తున్న పిల్లలందరికి ఆల్‌బెండజోల్ మాత్రలను పంపిణీ చేయనున్నారు. ఇందుకోసం వైద్యశాఖాధికారులు అన్ని ఏర్పాట్లను సిద్ధం చేశారు. ఇందుకు సంబంధించిన మాత్రలను ఇప్పటికే అంగన్‌వాడీలు, స్కూల్స్, కళాశాలలకు తరలించారు. ఈ మేరకు జిల్లా స్థాయి కార్యక్రమాన్ని వల్లూరు మోడల్ స్కూల్‌లో మంగళవారం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి స్ట్రేట్ ఎన్‌డీడీ మానిటరింగ్ ఆఫీసర్, జెడ్‌ఎంఓ జమాల్ బాషా, డీఎంఅండ్‌హెచ్‌ఓ నాగరాజు, ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ రమేష్ హాజరుకానున్నారు. ఏడాది వయసు నుంచి 19 ఏళ్ల వయసు ఉన్న పిల్లలందరికి ఈ నులిపురుగులను నివారించే మాత్రలను వేయనున్నారు.
వ్యాప్తి ఇలా..
● నులి పురుగులు కలుషిత ఆహారం, దుమ్ము ధూళి, ఈగలు వాలిన తినుబండారాలు తినటం వలన వ్యాపిస్తుంది.
● బహిరంగ ప్రదేశాల్లో మలవిసర్జన ద్వారా, కాళ్లకు చెప్పులు లేకుండా మరుగుదొడ్డికి వెళ్లడం ద్వారా కూడా వచ్చే అవకాశం ఉంది.
● ఆకుకూరలు, కాయగూరలు, పండ్లు, వంట సరుకులు, శుభ్రమైన నీటితో కడగకపోవడం వలన వస్తుంది.
● భోజనం వండేవారు, వడ్డించేవారు, తినేముందు తిన్న తరువాత చేతులు శుభ్రంగా కడక్కోకపోవడం వల్ల వస్తుంది.
● చేతివేళ్లకు గోర్లు ఉండటం వల్ల కూడా వచ్చే అవకాశం ఉంది.
● ఆరుబయట తిరిగేటప్పుడు బూట్లు, చెప్పులు ధరించకపోవడం వల్ల వస్తుంది.
బాల్యం చిక్కిపోతోంది..
జిల్లాలో 1 నుంచి 19 సంవత్సరాల లోపు పిల్లలు 4,71,835 మంది ఉన్నారు. ఇందులో 1 నుంచి 2 సంవత్సరాల పిల్లలకు (అంగన్‌వాడీ కేంద్రంలోని) ఆల్‌బెండజోల్ 200 ఎంజీ, 3 నుంచి 19 సంవత్సరాలలోపు వారికి 400 ఎంజీ మాత్రలు మధ్యాహ్నం భోజనం తరువాత నీళ్లలో మింగించాలి. భోజనం చేయకుండా మాత్రను వేసుకుంటే కడపునొప్పి, వాంతులు అయ్యే అవకాశం ఉంది. విద్యార్థులకు జ్వరం లేదా ఇతర ఇతర కారణాల వలన అనారోగ్యంగా ఉన్నప్పుడు వారికి ఆల్‌బెండజోల్ 400 గ్రాముల మాత్రలు ఇవ్వకూడదు.
ఆ రెండు మండలాలు మినహా..
జిల్లాలో ఒంటిమిట్ట, పులివెందుల మండలాలలో జెడ్పీటీసీ ఉప ఎన్నికల సందర్భంగా ఎన్నికల కోడ్ అమలులో ఉంది. దీంతో ఈ రెండు మండలాల్లో నులిపురుగుల నివారణ మందులు వేయడం లేదు. ఇక్కడ ఈనెల 20వ తేదీ నులి పురుగుల నివారణ మందులను వేయనున్నారు.
ఉపాధ్యాయులు పాటించాల్సిన నియమాలు..
● ఈ నులి పురుగుల కార్యక్రమాన్ని అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, అరోగ్యశాఖ అధికారులు స్నేహపూర్వక వాతావరణంలో నిర్వహించాలి.
● ప్రార్థన సమయంలో ఆల్‌బెండోజోల్ 400 గ్రాముల మాత్రల ఆవశ్యకతతోపాటు చేతుల పరిశుభ్రత గురించి వివరించాలి. అందేలా చూడాలి
నులిపురుగుల నిర్మూలన వల్ల ప్రయోజనాలు..
● పిల్లల్లో రక్తహీనత నియంత్రిస్తుంది.
● పోషకాహార ఉపయోగతను మెరుగు పరుస్తుంది
● వ్యాధి నిరోధకతను మెరుగు పరుస్తుంది
● ఏకాగ్రత, నేర్చుకోగల సామర్థ్యం, పాఠశాల మరియు అంగన్‌వాడీ కేంద్రానికి హాజరు మెరుగుపరుస్తుంది
నేడు జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమం
ఒంటిమిట్ట, పులివెందుల మినహా అన్ని మండలాల్లో మాత్రలు పంపిణీ
ఏర్పాట్లు పూర్తి చేసిన విద్యా, వైద్య
ఆరోగ్యశాఖలు
నేడు వల్లూరు మోడల్ స్కూల్‌లో జిల్లా కార్యక్రమం
చిన్నారుల ఆరోగ్య సంరక్షణే ధ్యేయం..
పిల్లల్లో నులి పురుగుల నివారణ లక్ష్యంగా వారి ఆరోగ్య సంరక్షణే ధ్యేయంగా ప్రభుత్వం మంచి కార్యక్రమం చేపట్టింది. ఈ పురుగుల నివారణకు ఆల్‌బెండోజోల్ 400 ఎంజీ ఒక మాత్ర 2 ఏళ్లలోపు పిల్లలకు సగం మాత్రను నలిపి వేయాలి. 3 ఏళ్ల నుంచి 19 ఏళ్ల లోపు వారికి ఒక మాత్ర చొప్పున వేయాలి. ఏదేని కారణాలతో మాత్రలు వేసుకోని వారికి 20వ తేదీన మళ్లీ వేస్తాం. అప్పుడు తప్పకుండా వేసుకోవాలి.
– డాక్టర్ కె. నాగరాజు, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి
ప్రతి పాఠశాలలో ఇవ్వాలి
జిల్లా వ్యాప్తంగా ఒంటిమిట్ట, పులివెందుల మండలాలు మినహా అన్ని పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులందరూ విద్యార్థులకు ఆల్‌బెండోజల్ 400 గ్రాముల మాత్రలను ఇవ్వాలి. ఈ విషయంలో వైద్యశాఖ, విద్యాశాఖ సమన్వయంతో పిల్లలకు మాత్రలను పంపిణీ చేయాలి. అన్ని జాగ్రత్తలను పాటిస్తూ పిల్లలతో మాత్రలను మింగించాలి. ఏదైనా తేడా అనిపిస్తే తక్షణం వైద్యుల దృష్టికి తీసుకెళ్లాలి.
– షేక్ షంషుద్దీన్, జిల్లా విద్యాశాఖాధికారి

ఒక్క మాత్రతో ‘నులి’మేద్దాం

ఒక్క మాత్రతో ‘నులి’మేద్దాం