
ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు
ప్రొద్దుటూరు : పోలీసులు – టీడీపీ నేతలు కలసి పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని మానభంగం చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాదరెడ్డి వ్యాఖ్యానించారు. టీడీపీ నేతల దౌర్జన్యాన్ని ఎదిరించి ఆయా గ్రామాల ప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. సోమవారం ప్రొద్దుటూరులోని తన స్వగృహంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో ఓటర్లను ఓటు వేయనీయకుండా.. దౌర్జన్యం చేసి పోలింగ్ ప్రారంభంలోనే వారు ఓటు వేసేకునేందుకు వ్యూహాన్ని రచించారన్నారు. తొలి నుంచి పులివెందుల ప్రాంత వాసులను రౌడీలుగా, గుండాలుగా, రాక్షసులుగా, ఆటవికులుగా చూపి మాట్లాడిన టీడీపీ నేతలు ఈ రోజు ఓట్ల కోసం మీ వద్దకు వచ్చారన్నారు. పులివెందులకు మెడికల్ కాలేజీని జగన్ ప్రభుత్వంలో మంజూరు చేస్తే ఆ కాలేజీలో సీట్లు ఇవ్వకుండా టీడీపీ ప్రభుత్వం నిలిపేసిందని గుర్తు చేశారు. పులివెందుల ప్రాంతానికి సంబంధించి నాడు వైఎస్ రాజశేఖరరెడ్డి హయాం నుంచి జగన్‌మోహన్‌రెడ్డి వరకు ఎన్నో అభివృద్ధి పనులు చేశారన్నారు. ప్రజల చేతికి ఓటు ఇస్తే ఓడిపోతామనే భయంతో టీడీపీ నేతలే జిల్లాలోని ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, కడపతోపాటు ఇతర నియోజకవర్గాల నుంచి కార్యకర్తలను, అనుచరులను పిలిపించి గ్రామాల్లో తిష్ట వేయించారన్నారు. ఉదయం పోలింగ్ ప్రారంభంకంటే ముందుగానే వారు గొడవలు సృష్టించే అవకాశం ఉందన్నారు. ఇందు కోసం ఒక్కో పోలింగ్ బూత్‌కు ఒక్కో నియోజకవర్గ ఎమ్మెల్యేలను టీడీపీ నియమించిందని ఆరోపించారు. ఈ విషయాన్ని గమనించి ఓటర్లు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. జగనన్న నాయకత్వంలో వైఎస్ కుటుంబాన్ని ప్రేమించే ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే వాదులందరూ మంగళవారం ఉదయం 6 గంటలకే పులివెందులలోని జగన్ ఇంటి వద్దకు చేరుకోవాలని, ఎక్కడైనా అవాంఛనీయ సంఘటనలు జరిగితే అక్కడి పోలింగ్ స్టేషన్ల వద్దకు వెళ్లాల్సి ఉంటుందన్నారు. లాఠీ చార్జీలకు, టీడీపీ నేతల దౌర్జన్యాలకు భయపడాల్సిన అవసరం లేదన్నారు. పార్టీ శ్రేణులంతా ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి వెంట ఉంటూ సంఘటితంగా ఉండాలని కోరారు.
చెక్ పోస్టుల వద్ద ప్రత్యేక కోడ్
ఎన్నికల ప్రచారం ముగిసిన వెంటనే ఇతర నియోజకవర్గాలకు చెందిన పార్టీ నాయకులందరిని పోలీసులు ఇళ్లకు పంపారని రాచమల్లు శివప్రసాదరెడ్డి తెలిపారు. సోమవారం సాయంత్రం నుంచే టీడీపీ నాయకులు, గుండాలు పులివెందులకు మళ్లీ చేరుకున్నారని, ఇందుకోసం చెక్ పోస్టుల వద్ద ప్రత్యేక కోడ్‌ను పోలీసులకు ఇచ్చిందన్నారు. పోలీసులు పూర్తిగా టీడీపీ తొత్తులుగా పనిచేస్తున్నారని విమర్శించారు. కోడ్ చూపించిన వారికి గ్రామాల్లోకి ప్రవేశం కల్పిస్తున్నారన్నారు. ముందుగానే గ్రామాల్లోకి చేరిన టీడీపీ నేతలు ఓటర్ల నుంచి స్లిప్‌లను సేకరించారన్నారు. మంగళవారం పోలింగ్ ప్రారంభమైన పోలింగ్ బూత్‌లో దొంగ ఓట్లు వేసుకుంటే అడ్డుకోబోయే వైఎస్సార్‌సీపీ ఏజెంట్లపై దాడి చేసి దౌర్జన్యంగా ఓట్లు వేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. సమావేశంలో వైఎస్సార్‌సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు పోరెడ్డి నరసింహారెడ్డి, పట్టణాధ్యక్షుడు, కౌన్సిలర్ భూమిరెడ్డి వంశీధర్‌రెడ్డి పాల్గొన్నారు.
పులివెందుల పోలింగ్ కేంద్రాల్లో ఇతర నియోజకవర్గాల కార్యకర్తలు తిష్ట
ఒక్కో బూత్‌కు ఒక్కో టీడీపీ ఎమ్మెల్యే నియామకం
వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాదరెడ్డి