
పెన్నానదికి నీరు విడుదల బంద్
జమ్మలమడుగు : మైలవరం జలాశయం నుంచి పెన్నానదికి అధికారులు నీటి విడుదలను ఆపేశారు. శనివారం నుంచి భారీగా నీరు విడుదల అవుతుండటంతో కొన్ని గ్రామాలకు సంబంధించిన రాకపోకలు బంద్ అయ్యాయి. ముఖ్యంగా వేపరాల–జమ్మలమడుగు రహదారిపై రాకపోకలు పూర్తి స్థాయిలో నిలిచిపోవడంతో పాటు రోడ్డు కొట్టుకునిపోయింది. అదేవిధంగా ఎర్రగుంట్ల మండలంలోని థర్మల్ , ముద్దనూరుకు వెళ్లే పెన్నానది రహదారి నీటి పెరుగుదల వల్ల రోడ్డు కోసుకుపోవడంతో ఈ ప్రాంతంలో కూడా రాకపోకలు బంద్ అయ్యాయి. ఆదివారం ఉదయం పెన్నానదిలో ముగ్గురు భక్తులు కన్యతీర్థం వెళ్లి తిరిగి వచ్చే సమయంలో వాహనం పెన్నానదిలో చిక్కుకోవడంతో బాధితులను బయటికి తీయడం కోసం నీటిని బంద్ చేశారు.
మైలవరంలో పూర్తి స్థాయిలో నీటి సామర్థ్యం..
శ్రీశైలం ప్రాజెక్టులో పూర్తి స్థాయిలో నీటి మట్టం ఉండటంతో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి జీఎన్‌ఎస్‌ఎస్ కాలువ ద్వారా నీటిని మళ్లిస్తున్నారు. ప్రస్తుతం జీఎన్‌ఎస్‌ఎస్ కాలువ ద్వారా రోజుకు 13 వేల క్యూసెక్కుల నీరు గండికోట ప్రాజెక్టులోనికి వచ్చి చేరుతుంది. ప్రస్తుతం గండికోటలో 14.5 టీఎంసీల నీరు నిల్వ ఉంది. దీని పూర్తి నీటి సామర్థ్యం 26 టీఎంసీలు. ప్రస్తుతం కృష్ణా జలాలు వస్తున్న నీటితో చిత్రావతి, వామికొండ, సర్వరాయసాగర్, మైలవరలం జలాశయంలో నీటిని నింపే ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాకుండా సోమశిల ప్రాజెక్టులోనికి సైతం కృష్ణా జలాలు పెన్నానది ద్వారా విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం మైలవరం జలాశయంలో 5.4 టీఎంసీల నీరు నిల్వ ఉంది. పూర్తి స్థాయిలో నీటి మట్టం ఉండటంతో గండికోట నుంచి నీటిని విడుదల చేస్తే ఆ నీరు మైలవరం జలాశయం నుంచి పెన్నానదికి వదిలేయాలి. దీంతో గండికోట ప్రాజెక్టుకు సంబంధించిన అధికారులు గండికోట నుంచి వదిలే నీటిని బంద్ చేశారు. మైలవరం జలాశయం నుంచి పెన్నానదిలోనికి నీటిని అధికారులు విడుదల చేస్తే గండికోట నుంచి మైలవరం జలాశయం లోనికి నీటిని విడుదల చేస్తామని అధికారులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం మైలవరం జలాశయం పూర్తి సామర్థ్యంతో ఉండటంతో వచ్చే నీరు దిగువకు వదలాల్సి ఉంది. ప్రస్తుతం బంద్ కావడంతోనే గండికోట నుంచి నీటిని బంద్ చేసినట్లు గండికోట, మైలవరం ప్రాజెక్టు అధికారులు పేర్కొంటున్నారు