
స్వర్ణ దుకాణంలో చోరీ
బద్వేలు అర్బన్ : స్థానిక సిద్దవటం రోడ్డులోని మసీదు కాంప్లెక్స్‌లో గల జె.బి. స్వర్ణ దుకాణంలో శనివారం రాత్రి చోరీ జరిగింది. ఈ ఘటనలో 72 గ్రాముల బంగారు ఆభరణాలు, 7 కిలోల వెండి వస్తువులు చోరీకి గురైనట్లు బాధితుడు తెలిపారు. పట్టణంలోని మార్కెట్‌వీధికి చెందిన జబీవుల్లా స్థానిక సిద్దవటం రోడ్డులోని మసీదు కాంప్లెక్స్‌లో గత కొన్నేళ్లుగా స్వర్ణ దుకాణం నిర్వహిస్తున్నాడు. రోజూ మాదిరే శనివారం కూడా వ్యాపార కార్యకలాపాలు పూర్తి చేసుకుని దుకాణంలోని వస్తువులన్నీ సర్ది బ్యాగులో ఉంచి ఇంటికి తీసుకువెళ్లేందుకు సిద్ధమయ్యాడు. ఇంతలో ఫోన్ రావడంతో దుకాణంలో ఉండే పిల్లలను చూస్తూ ఉండమని చెప్పి దుకాణం నుండి బయటికి వచ్చాడు. అప్పటికే కాపు కాసిన ఇద్దరు యువకులు దుకాణంలోకి వెళ్లి బంగారు, వెండి ఆభరణాలను భద్రపరిచిన బ్యాగులను తీసుకుని బైక్‌లో పరారయ్యారు. వెంటనే చుట్టుపక్కల వారు అప్రమత్తమై గట్టిగా కేకలు వేస్తూ వెంబడించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. విషయం తెలుసుకుని అక్కడికి చేరుకున్న దుకాణ యజమాని అర్బన్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు పట్టణంలో విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఆదివారం ఉదయం ఘటనా స్థలాన్ని క్లూస్‌టీం పరిశీలించి వేలిముద్రలు సేకరించారు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అర్బన్ పోలీసులు కేసు నమోదు చేశారు.
ఎమ్మెల్సీ ఆరా..
వైఎస్సార్‌సీపీ నాయకుడైన జబీవుల్లాకు చెందిన స్వర్ణ దుకాణంలో చోరీ జరిగిన విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి ఆదివారం ఘటనా స్థలాన్ని పరిశీలించి బాధితుడిని అడిగి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం స్థానిక పోలీసులతో ఫోన్‌లో మాట్లాడి నిందితులను గుర్తించి బాధితుడికి త్వరితగతిన న్యాయం చేయాలని కోరారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవసాని ఆదిత్యరెడ్డి, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి గురుమోహన్, మున్సిపల్ చైర్మన్ రాజగోపాల్‌రెడ్డి, మున్సిపాలిటీ అధ్యక్షుడు సుందర్‌రామిరెడ్డి, సింగిల్ విండో చైర్మన్ ప్రభాకర్‌రెడ్డి, పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు రమేష్‌బాబు తదితరులు పాల్గొన్నారు.