
సీ అండ్ డీ ప్రదేశంలో బీ గ్రేడ్ బైరెటీస్ ఖనిజం
ఓబులవారిపల్లె : తక్కువ గ్రేడ్ ఖనిజమైన సి అండ్ డి గ్రేడ్ యాడ్‌లో విలువైన బి గ్రేడ్ ఖనిజం తరలించి విక్రయిస్తున్నట్లు గుర్తించారు. ఈ విషయంపై ఆదివారం పెద్దఎత్తున బయట ప్రచారం జరుగుతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మంగంపేట ఏపీఎండీసీలో ఖనిజం అమ్మకాల్లో భారీ ఎత్తున అవకతవకలు జరుగుతున్నాయి. సి అండ్ డీ గ్రేడ్ 0.4 గ్రావిటీ కలిగి ఉండి రూ. 2200 టన్ను ధరతో ఏపీఎండీసీ విక్రయాలు చేస్తోంది. అయితే 1.2 గ్రావిటీ కల్గిన బి గ్రేడ్ ఖనిజం టన్ను ధర దాదాపు రూ. 6 వేలు ఉంది. గనుల నుండి వెలికి తీసిన బి గ్రేడ్ ఖనిజాన్ని కేటాయించిన స్థలంలో కాకుండా సి అండ్ డి గ్రేడ్ ఖనిజం ఉన్న యార్డుకు తరలించి సి అండ్ డి గ్రేడ్ ధరకు బి గ్రేడ్ ఖనిజాన్ని అక్రమంగా తరలించుకుని పోతున్నారు. దీంతో కోట్లాది రూపాయలు ప్రభుత్వ ధనాన్ని కొల్లగొడుతున్నారు. శనివారం బి గ్రేడ్ ఖనిజాన్ని సి అండ్ డి యార్డులో తోలినట్లు గమనించిన సిబ్బంది అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో అధికారులు ఖనిజాన్ని పరిశీలించారు. ఈ విషయంపై సీపీఓ గోపినాథ్‌ను వివరణ కోరగా బైరెటీస్ ఖనిజాన్ని పరిశీలించామన్నారు. అనాలసిస్ చేసిన అనంతరం 0.7 గ్రావిటీ వచ్చిందని అది సి అండ్ డి గ్రేడ్ ఖనిజమే అని నిర్ధారించినట్లు తెలిపారు.
కోట్ల రూపాయలు కొల్లగొడుతున్న వైనం