
ప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోండి
పులివెందుల : పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ఓటర్లు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలని ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి పేర్కొన్నారు.ఆదివారం మోట్నూతలపల్లె గ్రామంలో వైఎస్సార్‌సీపీ నాయకులు రెడ్యం వెంకటసుబ్బారెడ్డి, వైఎస్సార్‌సీపీ శ్రేణులతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ రామ సుబ్బారెడ్డి మాట్లాడుతూ ఈ జెడ్పీటీసీ ఎన్నిక చాలా చిన్నదని, జెడ్పీటీసీ మహేశ్వరరెడ్డి చనిపోయిన సందర్భంలో ఆయన కొడుకు హేమంత్‌రెడ్డిని జెడ్పీటీసీ అభ్యర్థిగా వైఎస్సార్‌సీపీ బరిలోకి దించిందన్నారు. సాధారణంగా ఈ ఎన్నికను సానుభూతికి వదిలేస్తారన్నారు. కానీ, ఆదినారాయణరెడ్డి లాంటి జిమ్మిక్కులు చేసే వ్యక్తులకు తోడు చంద్రబాబు, లోకేష్ పోటీకి వ చ్చారన్నారు. పోటీ చేయడం తప్పేమి లేదు గానీ, వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలను బెదిరింపులకు గురి చేయడం, కొంతమందిని ఆర్థికంగా ప్రలోభాలతో మభ్య పెట్టడం దారుణమన్నారు. దీంతో పాటు భౌతిక దాడులకు దిగడం అరాచకానికి పరాకాష్ట అని మండిపడ్డారు. వైఎస్సార్‌సీపీ నేతలపైనే రివర్స్‌గా ఎస్సీ, ఎస్టీ యాక్ట్ కేసు పెట్టించడం అన్యామన్నారు. ఇలా దుర్మార్గమైన పరిస్థితులలో ఎలెక్షన్లు జరుగుతున్నాయన్నారు. మరోవైపు పోలింగ్ కేంద్రాల మార్పుతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, ఓటు వేయడానికి ఓటర్లు రాకుండా కూటమి నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. ప్రజాస్వామ్యంలో ఇది తప్పుడు విధానమన్నారు. లోకేష్ ఆది నారాయణరెడ్డి ట్రాప్‌లో పడ్డారని, ఆదినారాయణరెడ్డి లేనిపోని అబద్దాలు మా ట్లాడుతూ విలువలు లేని రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. కూటమి నేతలు సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తామని గొప్పగా చెప్పి.. ఒక్క హామీ కూడా అమలు చేయలేదన్నారు. వైఎస్సార్, వైఎస్ జగన్‌లు పులివెందులను సస్యశ్యామలం చేశారని గుర్తు చేశారు.
ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి