
వైఎస్సార్‌సీపీ విజయం తథ్యం
ఒంటిమిట్ట(రాజంపేట): జెడ్పీటీసీ ఉపఎన్నికల ప్రచార చివరిరోజు ఆదివారం ఒంటిమిట్టలో వైఎస్సార్‌సీపీ భారీ ర్యాలీ చేపట్టింది.ఈ ర్యాలీలో పార్టీ శ్రేణులు కదం తొక్కాయి. కూటమి కుట్రలను తిప్పికొట్టేలా వైఎస్సార్‌సీపీ అభ్యర్థి ఇరగంరెడ్డి సుబ్బారెడ్డికి మద్దతుగా కొనసాగిన ర్యాలీకి విశేషస్పందన లభించింది. రాములోరి కల్యాణవేదిక ప్రాంతం నుంచి కొనసాగిన ర్యాలీలో వందలాది మంది నాయకులు, కార్యకర్తలు, వైఎస్సార్ అభిమానులు,వివిధ ప్రాంతాల రైతులు, యువకులు, విద్యార్థులు, ముస్లీంమైనార్టీలు, దళితులు పాల్గొన్నారు. ఒంటిమిట్ట వీధులు జనంతో కిక్కిరిసిపోయాయి. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉపఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల విజయం తథ్యమని ధీమాను వ్యక్తంచేశారు. వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథ్‌రెడ్డి మాట్లాడుతూ పులివెందుల, ఒంటిమిట్ట వైఎస్ జగన్ అడ్డా అన్నారు. ఎంతమంది ఎన్నికుట్రలు పన్నినా, కేబినెట్ కదిలివచ్చినా చేసేదేమి ఉండదని, ఓటమి చవిచూడటం తప్ప అన్నారు. రాజ్యసభ సభ్యుడు మేడా రఘునాథరెడ్డి మాట్లాడుతూ జెడ్పీటీసీ ఉపఎన్నికల్లో కూటమి కుట్రలను ఒంటిమిట్ట వాసులే ఓటు అనే ఆయుధంతో తిప్పికొడతారన్నారు. ఎన్నికలకోడ్ ఉల్లంఘన యథేచ్ఛగా ఒంటిమిట్టలో కొనసాగిందని ఉన్నతాధికారులకు తెలిసినా అడ్డుకోలేని నిస్సహాయస్థితిలో ఉన్నారన్నారు. పులివెందుల, ఒంటిమిట్టలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులకు ప్రజలే అండగా నిలుస్తున్నారన్నారు. వైఎస్సార్‌సీపీ అభ్యర్ధి ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి మాట్లాడుతూ ఆశీర్వదించాలని ఓటర్లను అభ్యర్థిచారు.
● ర్యాలీలో రాజ్యసభ సభ్యుడు మేడా రఘునాథరెడ్డి, రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాఽథరెడ్డి, బద్వేలు ఎమ్మెల్యే సుధ, ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి, పార్లమెంట్ పరిశీలకులు కొండూరు అజయ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు అంజద్‌బాషా, కొరముట్ల, కడప జెడ్పీచైర్మన్ రామగోవిందరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఒంటిమిట్టలో భారీ ప్రచార ర్యాలీ