
ఆటోను ఢీకొన్న కారు
వేంపల్లె : మండలంలోని కత్తులూరు క్రాస్ వద్ద ఆటోను కారు ఢీకొన్న సంఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న గండ్లూరు పుల్లయ్య (55) అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుని బంధువులు ఇచ్చిన వివరాల మేరకు.. మండలంలోని టి.వెలమవారిపల్లె గ్రామానికి చెందిన మెకానిక్ వలీ శ్రావణ మాసం మూడవ శనివారం సందర్భంగా గండి క్షేత్రానికి తన సొంత ఆటోలో కుటుంబ సమేతంగా బయలుదేరాడు. కత్తులూరు క్రాస్ వద్దకు ఆటో రాగానే రాజంపేటకు చెందిన వెంకటరమణ అనే వ్యక్తి తన కుటుంబ సభ్యులతో కారులో పులివెందుల నుంచి రాజంపేటకు వెళుతూ ముందు వెళుతున్న ఆటోను ప్రమాదవశాత్తు ఢీకొన్నాడు. దీంతో ఆటో సమీపంలో ఉన్న చెట్టును ఢీకొంది. ఆటోలో ప్రయాణిస్తున్న వారు కింద పడ్డారు. గండ్లూరు పుల్లయ్య అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. అలాగే డ్రైవింగ్ చేస్తున్న వలీ, చిన్నారులైన సయాన్, మెహిరున్, వలిమాలకు తీవ్ర రక్త గాయాలయ్యాయి. ఈ సంఘటనను చూసిన స్థానికులు 108 వాహనం ద్వారా హుటాహుటిన వేంపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం తీవ్ర గాయాలైన సయాన్, మెహిరున్, వలిమాలను మెరుగైన చికిత్స కోసం కడప రిమ్స్‌కు తరలించారు. రోడ్డు ప్రమాదంలో గండ్లూరు పుల్లయ్య మృతి చెందడంతో వేంపల్లె ప్రభుత్వాసుపత్రి వద్దకు టి.వెలమవారిపల్లె ప్రజలు భారీ ఎత్తున తరలి వచ్చారు. బాధిత కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఒకరి మృతి.. ముగ్గురికి తీవ్ర గాయాలు