
విద్యా సంస్థల దోపిడీకి అడ్డుకట్ట వేయాలి
కడప కోటిరెడ్డిసర్కిల్/రూరల్ : రాష్ట్రంలోని ప్రైవేటు, కార్పొరేట్ విద్యా సంస్థల యాజమాన్యాల దోపిడీకి అడ్డుకట్ట వేసి తక్షణమే విద్యాహక్కు చట్టం అమలు చేయాలని ఏపీ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దుడెం రెడ్డిబాబు డిమాండ్ చేశారు. శనివారం కడప నగరంలోని బీసీ సంక్షేమ సంఘం కార్యాలయంలో విద్యా హక్కు చట్టం అమలు చేస్తారా? లేదా? అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రైవేటు, ప్రభుత్వ విద్యా సంస్థల్లోకి బీసీ, ప్రజా, విద్యార్థి సంఘాలు అనుమతి లేకుండా ప్రవేశించరాదని జీఓ జారీ చేయడం దారుణమన్నారు. ఈ జీఓ కారణంగా ఆయా విద్యా సంస్థల యాజమన్యాల అక్రమాలకు అడ్డు అదుపు లేకుండా పోతుందన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ ప్రజా సంఘాలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.
ముదిరాజ్ కులస్తులు చైతన్యవంతులు కావాలి
రాష్ట్రంలోని ముదిరాజ్ కులస్తులు చైతన్యవంతులై తమ హక్కుల సాధనకు ముందుకు రావాలని ఆంధ్రప్రదేశ్ ముదిరాజ్ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దుడెం రెడ్డిబాబు పిలుపునిచ్చారు. శనివారం కడప నగరంలోని బీసీ సంక్షేమ సంఘం కార్యాలయంలో ముదిరాజ్ సంక్షేమ సంఘ కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా శివశంకర్, ఉపాధ్యక్షులుగా మణికుమార్, వివేకానంద, ప్రధాన కార్యదర్శిగా సునీల్, కార్యదర్శిగా నరసింహులుతోపాటు ఇతర కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు మాట్లాడుతూ ముదిరాజ్‌లను ప్రస్తుతం ఉన్న బీసీ–డీ నుంచి బీసీ–ఏ లోకి మార్చి తగిన న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంక్షేమ సంఘం ప్రతినిధులు, ముదిరాజ్ సామాజిక వర్గ ప్రతినిధులు పాల్గొన్నారు.