
ఆర్టీసీ స్థలాన్ని లూలూ షాపింగ్ మాల్‌కు ఇవ్వడం తగదు
కడప కోటిరెడ్డిసర్కిల్ : విజయవాడ నగరంలోని ఏపీఎస్ ఆర్టీసీ గవర్నరుపేట 1–2 డిపోలకు, పాత బస్టాండుకు సంబంధించిన నాలుగు వందల కోట్ల రూపాయల విలువ గల 4.15 ఎకరాల స్థలాన్ని లూలూ షాపింగ్ మాల్‌కు ప్రభుత్వం కట్టబెట్టడం దారుణమని ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా గౌరవాధ్యక్షుడు ఎల్.నాగసుబ్బారెడ్డి, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బోసుబాబు, రామ్మూర్తి పేర్కొన్నారు. శనివారం కడపలోని అసోసియేషన్ జోనల్ కార్యాలయంలో మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. ఈ రెండు డిపోలలో 200 బస్సులతో పాటు 1100 మంది ఉద్యోగులు విధులు నిర్వర్తిస్తున్నారన్నారు. ఆర్టీసీని ప్రజలకు దూరం చేస్తూ ఓ పారిశ్రామికవేత్తకు జీఓ నంబర్. 137 ద్వారా కట్టబెట్టడాన్ని ఖండిస్తున్నామన్నారు. గవర్నరుపేట డిపోలకు 1, 2, పాత బస్టాండ్ స్థలాన్ని 1959లో గజం రూ. 16 చొప్పున సుమారు నాలుగు లక్షల ఆరు వేల రూపాయలకు ప్రభుత్వం కేటాయించిన రేటుకు ఆర్టీసీ యాజమాన్యం కొనుగోలు చేసిందన్నారు. ఇలాంటి విలువైన స్థలాన్ని వ్యాపార వేత్తలకు ధారాదత్తం చేసేందుకు తీసుకుంటున్న చర్యలను వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో యూనియన్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ యం.మల్లికార్జున, కడప డిపో అధ్యక్షుడు ఈ.రాము, వర్కింగ్ ప్రెసిడెంట్ విల్సన్, ఉపాధ్యక్షుడు విష్ణువర్ధనుడు, పీవీ సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు.
ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ నేతలు