
ఎన్నికల భగ్నానికి కూటమి నాయకుల యత్నం
కడప ఎడ్యుకేషన్ : ప్రజాస్వామ్యయుతంగా జరగాల్సిన జెడ్పీటీసీ ఉప ఎన్నికను భగ్నం చేసేందుకు కూటమి ప్రభుత్వం కుట్ర చేస్తోందని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్‌రెడ్డి పేర్కొన్నారు. పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికకు పోలింగ్ కేంద్రాల మార్పు చేయరాదని కలెక్టర్ చెరుకూరు శ్రీధర్‌ను శుక్రవారం ఆయన కలిసి వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా రవీంద్రనాథ్‌రెడ్డి మాట్లాడుతూ జెడ్పీటీసీ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం కుట్ర రాజకీయాలు చేస్తోందన్నారు. ఇప్పటికిప్పుడు ఒక ఊరు నుంచి మరో ఊరికి పోలింగ్ కేంద్రాలను మార్పు చేయడంతో ప్రజలు ఓటు వేసేందుకు రెండు, మూడు కిలోమీటర్లు వెళ్లాల్సి వస్తోందన్నారు. వారి కుట్రలేవీ పనిచేయవన్నారు. ఇటీవల ఎన్నికల ప్రచారం కోసం వెళ్లిన ఎమ్మెల్సే రమేష్ యాదవ్, నాయకులు రామలింగారెడ్డిలపై కూటమి నాయకులు దాడిచేసి చేయి విరగ్గొట్టారన్నారు. ఇవన్నీ మనం సినిమాల్లోనే చూసేవారమని.. ఇప్పుడు రియల్‌గానే చూస్తున్నామన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా ఎమ్మెల్సీ ఎన్నిక ప్రశాంతంగా జరగలేదా? అని ప్రశ్నించారు. 2024లో బీటెక్ రవి పోటీ చేసినప్పుడు ప్రశాంతంగా ఎన్నికలు జరిగాయని, ఎక్కడా రీపోలింగ్ జరిగిన దాఖలాలు లేవని అన్నారు. ప్రజలను బయబ్రాంతులకు గురిచేసి ఎన్నికల్లో గెలవాని కూటమి ప్రభుత్వం కుట్ర చేస్తోందని, దీనిని ప్రజలు గమనిస్తున్నారన్నారు. పోలింగ్ కేంద్రాలను మార్చడం చూస్తుంటే.. పరీక్షల సమయంలో జంబ్లిగ్ విధానం గుర్తుకు వస్తోందన్నారు. కేంద్రాలను మార్చిన విషయాన్ని ఎన్నికల కమిషన్, కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. తాము గతంలో ఇలా చేసి ఉంటే నారా లోకేష్ ప్రజాగళం యాత్ర, పవన్ కళ్యాన్ వారాహి యాత్ర చేసేవారే కాదన్నారు. ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. పులిసునీల్‌కుమార్, సుదర్శన్‌రెడ్డి పాల్గొన్నారు.
ప్రజలను భయాందోళనకుగురి చేస్తున్నారు
ఓటింగ్ శాతం తగ్గించేందుకు
పోలింగ్ కేంద్రాల మార్పు
కలెక్టర్‌కు విన్నవించిన వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు రవీంద్రనాథ్‌రెడ్డి