
శిక్షణ ఫలాలు సఫలీకృతం కావాలి
కడప ఎడ్యుకేషన్ : కేజీబీవీలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు ఇచ్చిన శిక్షణ సఫలీకృతమయ్యే విధంగా చూడాలని జిల్లా సమగ్రశిక్ష అడిషనల్ ప్రాజెక్టు కోఆర్డినేటర్ నిత్యనందరాజు సూచించారు. కడప నగర శివారులోని గ్లోబర్ ఇంజినీరింగ్ కళాశాలలో ఈ నెల 3వ తేదీ నుంచి 7వ తేదీ వరకూ వివిధ ఫిజిక్స్, కెమిస్ట్రీ అధ్యాపకులకు ఇచ్చిన శిక్షణ గురువారం ముగిసింది. ఏపీసీ నిత్యానందరాజు మాట్లాడుతూ జీసీడీవో దార్త రూత్ ఆరోగ్యమేరీ ఆధ్వర్యంలో కడప, కర్నూల్, చిత్తూరు, అనంతపురం, సత్యసాయి, తిరుపతి, చిత్తూరు, నంద్యాల, నెల్లూరు జిల్లాలకు చెందిన ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చారన్నారు. బీడు, చౌడు భూముల్లో సేద్యం చేసి పంటలు పండించడం ఎంతకష్టమో. వెనుకబడిన కుటుంబాల నుంచి వచ్చిన విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దడం అంతే కష్టమన్నారు. శిక్షణ తరగతుల్లో 21 మంది రిసోర్సు పర్సన్స్ పనిచేశారన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంవో వీరేంద్రరావు, ఏఎస్‌ఓ సంజీవరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.