
వరాల పండుగకు వేళాయె!
కడప సెవెన్‌రోడ్స్: మహిళలు తమ సౌభాగ్యం కోసం ప్రార్థించే పండుగల్లో శ్రీ వరలక్ష్మిమాత వ్రతం ముఖ్యమైనది. శుక్రవారం పండుగ నిర్వహణ కోసం అవసరమైన ఏర్పాట్లలో ప్రజలు నిమ గ్నమయ్యారు. వరలక్ష్మీదేవి ఆరాధన కోసం అవసరమైన పూలు, పండ్లు, అరటి పిలకలు, మామిడాకులు, తమలపాకులు, టెంకాయలు, కర్పూరం, గంధం, కడ్డీలు తదితర పూజా సామగ్రి దుకాణా లు మహిళలతో రద్దీగా మారాయి. ముఖ్యంగా కడప నగరంలోని పాత బస్టాండు, గర్ల్స్ జూనియర్ కళాశాల, వన్‌టౌన్ సర్కిల్, బీకేఎం స్ట్రీట్, ఆర్టీసీ బస్టాండు, కాగితాలపెంట, దొంగలచెరువుకట్ట, అప్సర సర్కిల్ తదితర ప్రాంతాలు జనంతో కిటకిటలాడాయి. పండుగ కావడంతో పూజా సామాగ్రికి అవసరమైన వస్తువుల ధరలు కూడా వ్యా పారులు అమాంతం పెంచేశారు. కనకాంబరాలు పావు రూ.100, మల్లె, జాజి పూలు పావు రూ.80, చెండుమల్లె కిలో రూ.150, చేమంతి, రోజా పూలు కిలో రూ. 400 చొప్పున విక్రయించారు. అరటి పిలక రూ.30, అరటి పండ్లు డజన్ రూ. 60, మామిడి ఆకులు రూ.30 చొప్పున విక్రయించారు. తాము నందలూరు, రాజంపేట వంటి దూర ప్రాంతాల నుంచి అరటి పిలకలను తీసుకొచ్చి విక్రయిస్తున్నామని, కనీసం రూ. 50 ఉంటేనే గిట్టుబాటు అవుతుందని వ్యాపారులు చెబుతున్నారు.
వరలక్ష్మీ వ్రతానికి ఏర్పాట్లు
బ్రాహ్మణులు, వేద పండితుల ఆధ్వర్యంలో వరలక్ష్మివ్రతం కోసం అమ్మవారి కలశ ప్రతిష్ఠ చేసేందుకు భక్తులు సన్నాహాలు ప్రారంభించారు. మరికొన్నిచోట్ల సామూహిక వ్రతాల కోసం ఏర్పాట్లు చేసుకున్నారు. శ్రావణమాసంలో వచ్చే ఈ పండుగను భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తే అమ్మవారు కరుణించి కోరిన వరాలిస్తారని, సౌభాగ్యం అందజేస్తారని భక్తుల విశ్వాసం. కడప నగరంలో శ్రీ కన్యకా పరమేశ్వరీదేవి ఆలయంలో ఉదయం నిర్వాహకులు భక్తులచే సామూహికంగా అమ్మవారి వ్రతం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
నేడు వరలక్ష్మివ్రతం
ఆలయాలు, ఇళ్లల్లో విశేష పూజలు

వరాల పండుగకు వేళాయె!