
ఎన్నికల నిర్వహణకు పటిష్ట చర్యలు: ఎస్పీ
కడప అర్బన్: పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాలకు ఈనెల 12న జరగనున్న ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నామని ఎస్పీ అశోక్‌కుమార్ అన్నారు. గురువారం కడపలోని జిల్లా పోలీసు కార్యాలయం ఆవరణలో ‘పెన్నార్ పోలీస్ కాన్ఫరెన్స్’హాల్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. పులివెందులలో జరిగిన దాడులు, అల్లర్ల సంఘటనలపై సమగ్రంగా విచారిస్తున్నామన్నారు. సంఘటనలకు బాధ్యులైన వారిపై చట్టపరంగా చర్యలను తీసుకుంటామని స్పష్టం చేశారు. ఎన్నికల ప్రచార సమయంలోనూ ఆ ప్రాంతానికి చెందిన వారు కాకుండా ఇతరులకు అనుమతి లేదన్నారు. పులివెందుల జెడ్పీటీసీ స్థానంలో ప్రశాంత వాతావరణంలో ఎన్నిక జరిగేందుకు దాదాపు 600 మంది పోలీసు అధికారులు, సిబ్బందిని కేటాయించామన్నారు.
‘గండికోట’ కేసులో టెక్నికల్‌గా విచారణ
గండికోటలో జరిగిన మైనర్‌బాలిక హత్య కేసులో ఇంకా టెక్నికల్‌గా ఆధారాలపై సమగ్రంగా విచారణ చేస్తున్నామని ఎస్పీ ఈజీ అశోక్‌కుమార్ తెలియజేశారు. త్వరలోనే ఈ కేసును ఛేదిస్తామని వెల్లడించారు.
గండిలో ట్రాఫిక్ ఆంక్షలు
చక్రాయపేట: శ్రావణ మాస ఉత్సవాల్లో భాగంగా మూడవ శనివారం రోజు వాహనాలను ఎట్టి పరిస్థితిలోను గండిలోకి అనుమతించే ప్రసక్తి లేదని ఆర్కే వ్యాలీ ఎస్సై రంగారావు తెలిపారు.శ్రావణ మాసం మూడవ శనివారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందని చెప్పారు.దీన్ని దృష్టిలో ఉంచుకొని ట్రాఫిక్ ఆంక్షలు పెట్టినట్లు ఆయన వివరించారు. ఉదయం 5గంటల నుంచే ట్రాఫిక్ ఆంక్షలు అమలులోకి వస్తాయని చెప్పారు. సాయంత్రం భక్తుల రద్దీని బట్టి ఆంక్షలను సడలిస్తామని చెప్పారు.