‘స్టార్టప్ కడప సెంటర్’కు శ్రీకారం
కడప ఎడ్యుకేషన్: పారిశ్రామిక ప్రగతికి, యువతలో ఆవిష్కరణకు, ప్రాంతీయ ఆర్థికాభివృద్ధికి దోహదపడేలా అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ‘స్టార్టప్ కడప ఎంట్రప్రెన్యూర్‌షిప్ సెంటర్’ నిర్మాణానికి శ్రీకారం చుడుతున్నట్లు జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ తెలిపారు. ఈ కేంద్రానికి కడప ఆర్ట్స్ కాలేజీ సమీపంలో సోమవారం జిల్లా ఇన్‌చార్జి మంత్రి సవిత శంకుస్థాపన చేయనున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ కేంద్రం యువ స్టార్టప్ వ్యవస్థాపకులు, ఫ్రీలాన్సర్లు, చిన్న, మధ్యతరహా వ్యాపార సంస్థల అభివృద్ధికి పునాది వేస్తూ, కడపను వ్యాపార అవకాశాల కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా కీలక పాత్ర పోషించనుందన్నారు. దేశ, విదేశాల్లో స్థిరపడిన కడప జిల్లా వాసుల సహకారంతో, వారిని అనుసంధానం చేసుకుని ఈ స్టార్ట్ అప్ హబ్‌ను ముందుకు తీసుకువెళ్తామన్నారు.
ప్రాజెక్ట్ లక్ష్యాలు: స్టార్టప్ కడప కేంద్రం ఆవిష్కరణను ప్రోత్సహించడమే కాక, ఆలోచనల నుంచి అభివృద్ధి చెందిన వ్యాపారాల వరకు అన్ని దశల్లో స్టార్టప్‌లకు మద్దతు అందించేందుకు రూపొందించారు. ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు, వృత్తిపరమైన వర్క్‌స్పేస్‌లు, సహకార వాతావరణం వంటి అంశాలతో యువతకు అవసరమైన అన్ని వనరులు ఈ కేంద్రం అందించనుంది.
నేడు శంకుస్థాపన
కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి
నిర్మాణ వివరాలు
ఎ+3 అంతస్తులు, 25,000 చదరపు అడుగుల విస్తీర్ణం పీఈబీ టెక్నాలజీ ఆధారంగా నిర్మాణం.
ప్రాజెక్ట్ మొత్తం వ్యయం: ఈ ప్రాజెక్టును రూ.10 కోట్ల అంచనా వ్యయంతో నిర్మిస్తారు. షిర్డీసాయి ఎలక్ట్రికల్స్ సంస్థ రూ.4 కోట్ల విరాళం అందించింది.


